‘ప్రజల గుండె చప్పుడు విన్న నేత వైఎస్ఆర్‌’

3 Sep, 2017 01:20 IST|Sakshi

వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి





సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేసి విజయం సాధించిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని, ఆయన పాలన ఒక సువర్ణయుగం అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వైఎస్సార్‌ కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించు కున్న మహానేత అని కొనియాడారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం వైఎస్సార్‌ 8వ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌ ఏనాడు మాటలు చెప్పలేదని.. అభివృద్ధిని చేసి చూపించారని, ఆ చేతలే పేద ప్రజలకు అండగా నిలిచాయని చెప్పారు.

వైఎస్సార్‌ వెళుతూ వెళుతూ మనకు ఓ వారసత్వం,  భవిష్యత్తుకు అవసరమైన నాయకుణ్ణి జగన్‌ రూపంలో ఇచ్చి వెళ్లారన్నారు. వైఎస్సార్‌ అలుపెరగని పోరాటం ఆయన వారసత్వంగా జగన్‌కు వచ్చిందన్నారు. రాబోయే కాలం మనది, కసితో ముందుకు పోదామని తెలుగు రాష్ట్రాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. ఈ మూడున్నరేళ్లలో బాబు చేసిందేమీ లేదని, అంతా మోసమేనని దుయ్యబట్టారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పగలు, రాత్రి తేడా లేకుండా ఓటర్లను బెదిరించి, డబ్బులు వెదజల్లి వికృత క్రీడకు తెరలేపాడని ధ్వజమెత్తారు. ఈ అరాచకాలు చూసి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు నిరాశ పడాల్సిన అవసరం లేదని, మరింత కసితో పార్టీని ముందుకు తీసుకెళ్దామని తెలిపారు. వైఎస్సార్‌ కుటుంబం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టబోతున్నామని, రాబోయే ఎన్నికల్లో విజయానికి ఇదే మనకు నాంది కావాలన్నారు.




ప్రతి పేదవాడి గుండెల్లో వైఎస్సార్‌ చిరస్మరణీయుడుగా ఉన్నారని పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి చెప్పారు. వైఎస్సార్‌ సంక్షేమ రాజ్యం కోసం పాటుపడాలని కార్యకర్తలకు సూచించారు. రాజన్న రాజ్యం కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జోçహార్‌ వైఎస్సార్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు జి. ఆదిశేషగిరిరావు, పీఎన్‌వీ ప్రసాద్,  ప్రసాద రాజు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, వాసిరెడ్డి పద్మ, పుత్తా ప్రతాప్‌ రెడ్డి, చల్లా మధు, విజయచందర్, పద్మజా రెడ్డి, మరురు రామలింగారెడ్డి, భవనం భూషణ్, బి. మోహన్‌ కుమార్, తెలంగాణ ప్రాంత నాయకులు సింగిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, మాదిరెడ్డి భగవంత్‌ రెడ్డి, బొడ్డు సాయినాథ్‌ రెడ్డి, బెంబడి శ్రీనివాస్‌ రెడ్డి, వెల్లాల రామ్మోహన్, పర్వతరెడ్డి బాలక్రిష్ణారెడ్డి, బీష్వ రవీందర్, పాలెం రఘునాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చీరలు, బెడ్‌ షీట్ల పంపిణీ
మహానేత వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేత పుత్తా ప్రతాప్‌ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున చీరల పంపిణీ జరిగింది. చల్లా మధు అంధులకు రూ. 25వేల చెక్‌ అందించారు. బెడ్‌ షీట్లు పంపిణీ చేశారు.