నేడు వైఎస్సార్‌ 71వ జయంతి 

8 Jul, 2020 03:22 IST|Sakshi

ఇడుపులపాయ చేరుకున్న సీఎం జగన్‌

వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నేడు నివాళి 

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 71వ జయంతిని పురస్కరించుకుని బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరగనున్నాయి. తన తండ్రికి నివాళులర్పించడానికి సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం సాయంత్రం ఇడుపులపాయకు చేరుకున్నారు. బుధవారం ఉదయం 8.10 గంటలకు తన కుటుంబసభ్యులు, బంధువులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలసి వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద సీఎం వైఎస్‌ జగన్‌ నివాళులర్పిస్తారు. అనంతరం ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఇడుపులపాయలో పోలీసుల నుంచి  గౌరవ వందనం స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

సీఎం పాల్గొనే కార్యక్రమాలివీ... 
► గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సాంకేతిక విద్యనందించేందుకు ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్‌ ఐటీలో రూ.139.83 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నిర్మించిన ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ తరగతి భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. 
► ట్రిపుల్‌ ఐటీకి వాడే విద్యుత్‌ వ్యయాన్ని తగ్గించేందుకు ఇడుపులపాయ నెమళ్ల పార్కు పక్కన మూడు మెగావాట్ల సామర్థ్యంతో రెస్కో కోలబ్రేషన్‌ సిస్టమ్‌తో సోలార్‌ విద్యుత్‌ ప్లాంటు నిర్మించారు. ఇందుకు 18 ఎకరాల ట్రిపుల్‌ ఐటీ స్థలాన్ని కేటాయించారు. ప్రస్తుతం ఆర్‌కేవ్యాలీ ట్రిపుల్‌ ఐటీకి యూనిట్‌కు రూ.7.66తో విద్యుత్‌ బిల్లును చెల్లిస్తున్నారు. ఈ సోలార్‌ ప్లాంటు ద్వారా యూనిట్‌కు రూ.3.45తో బిల్లును చెల్లించవచ్చు. దీంతో ఏటా రూ.1.81 కోట్ల మేరకు ఆర్జీయూకేటీ యూనివర్సిటీకి ఆదా అవుతుంది. ఇందుకు సంబంధించిన శిలాఫలాకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. 
► ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ విగ్రహాన్ని కూడా ఆయన ఆవిష్కరిస్తారు.  
► ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో చదివే విద్యార్థులు ప్రపంచస్థాయికి ఎదగాలనే లక్ష్యంతో రూ.10.10 కోట్లతో ఏర్పాటు చేసే కంప్యూటర్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తారు.
► అలాగే క్యాంపస్‌లో రూ.40 కోట్ల అంచనా వ్యయంతో 2,500 మంది విద్యార్థులు పట్టేలా ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్‌ ఆడిటోరియంకు కూడా శంకుస్థాపన చేస్తారు.

తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో... 
ఇదిలా ఉండగా, వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకుని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉదయం 9.15 గంటలకు మహానేతకు ఘనంగా నివాళులర్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డితోపాటుగా పలువురు సీనియర్‌ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

మరిన్ని వార్తలు