ట్రిపుల్‌ ఐటీ పిలుస్తోంది..

15 Jun, 2019 07:48 IST|Sakshi
నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌

సాక్షి, విశాఖపట్నం : గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్యనందించేందుకు రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయాల పరిధిలో ఏర్పాటు చేసిన ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్‌ విద్యా ప్రవేశానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నాలుగు ట్రిపుల్‌ ఐటీలలో ప్రవేశాలకు జూలై 1లోగా దరఖాస్తులు చేసుకోవాలి. 10వ తరగతిలో ఉత్తమ గ్రేడ్‌ పాయింట్లు సాధించిన విద్యార్థులకు జీపీఏ ఆధారంగా  ప్రవేశాలు కల్పిస్తారు. ఈ విద్యా సంస్థల్లో రెండేళ్లపాటు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం వంటివి బోధిస్తారు. ఈ రెండేళ్లు చదువును ఇంటర్మీడియెట్‌తో సమానంగా పరిగణించి.. ఆ తర్వాత ఇంటర్‌లో వచ్చే మార్కులు, సామాజిక వర్గాల రిజర్వేషన్‌ ప్రాతిపదికన ఇంజినీరింగ్‌లో శాఖలను కేటాయించి నాలుగేళ్లపాటు విద్యనందిస్తారు

ప్రవేశాల షెడ్యూల్‌ ఇదే..
ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీలలో ఈ ఏడాది కొత్తగా 4 వేల మందికి సీట్లు లభించనున్నాయి. ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు జూలై 1 వరకు ఆఖరు తేదీగా పరిగణించారు. వికలాంగ, సైనికోద్యోగుల పిల్లలు, ఎన్‌సీసీ క్రీడా కోటాల వంటి ప్రత్యేక కేటగిరీల కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కేటగిరీ అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రింట్‌ కాపీలను జూలై 1లోగా యూనివర్సిటీకి పంపాలి. ఇతర ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యర్థులు ప్రింట్‌ ఔట్‌ కాపీలు పంపాల్సిన అవసరం లేదు. ప్రత్యేక కేటగిరీల అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన జూలై 14, 15వ తేదీల్లో నూజివీడులో నిర్వహిస్తారు. ప్రత్యేక కేటగిరీలు మినహా ఇతర అభ్యర్థుల ప్రొవిజనల్‌ సెలెక్షన్‌ జాబితాను జూలై 23న ప్రకటిస్తారు. మొదటి విడతలో నూజివీడు, ఇడుపులపాయ అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రవేశాలు ఆగస్టు 5, 6వ తేదీల్లో ఆయా ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో నిర్వహిస్తారు. ఆగస్టు 7, 8వ తేదీలలో ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ధ్రువపత్రాల పరిశీల న ఉంటుంది. ట్రిపుల్‌ ఐటీలలో వికలాంగులు, సైనికుల పిల్లలు, ఎన్‌సీసీ క్రీడల కోటా కింద ఎంపికైన అభ్యర్థుల జాబితా జూలై 20న ప్రకటిస్తారు. వీరికి జూలై 24, 25, 26, 27వ తేదీల్లో నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ధ్రువపత్రాల పరిశీలన , ప్రవేశాలు క ల్పిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఆగస్టు 9 నుంచి రెగ్యులర్‌ తరగతులు ప్రారంభమవుతాయి.

ప్రవేశ విధానం ఇలా..
2019 పదో తరగతిలో సాధించిన జీపీఏ పాయింట్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రతి మండలానికి చెందిన విద్యార్థులకు ఈ ట్రిపుల్‌ ఐటీలలో అవకాశం కల్పిస్తారు. ఇడుపులపాయ, నూజి వీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలలో ఒక్కొక్క దానిలో 1000 మంది చొప్పున 4 వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. వీటిలో 85 శాతం సీట్లను ఆయా విశ్వవిద్యాలయాలు ట్రిపుల్‌ ఐటీల పరిధిలోని జిల్లాకు చెందిన విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లలో ప్రతిభ ఆధారంగా ఏపీ, టీఎస్‌ రాష్ట్రాలకు చెంది న విద్యార్థులను ఓపెన్‌ కేటగిరీలో ఎంపిక చేస్తారు.

ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు పంపాలి
2019లో ఉత్తీర్ణత సాధించిన 10వ తరగతి విద్యార్థులు ఆన్‌లైన్‌లో http://www.rgukt.in/ వెబ్‌సైట్‌లో జూలై 1లోగా దరఖాస్తులు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో 10వ తరగతి హాల్‌ టికెట్, మార్కుల జాబితా, టీసీ, ఆధార్‌ కార్డు, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలు, విద్యార్థి తల్లిదండ్రుల ఫొటోలను సమర్పించాలి. వికలాంగులు, సైనికుల పిల్లలు, ఎన్‌సీసీ, క్రీడ కోటా కింద ఎంపికైన వారు సంబంధిత అధికారులు ఇచ్చే ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ప్రవేశాల సమయంలో విద్యార్థులు దరఖాస్తు ప్రింట్‌ ఔట్‌ కాపీలు, ఏపీ ఆన్‌లైన్‌ రసీదు, పైన పేర్కొన్న ధ్రువీకరణ పత్రాలన్నింటినీ సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ప్రత్యేక కేటగిరీ వారే గుంటూరు జిల్లా తాడేపల్లెలోని ఆర్జీయూకేటీ ప్రధాన కార్యాలయానికి దరఖాస్తు ప్రింట్‌ పత్రాలు పంపాలి. వికలాంగులు, ఎన్‌సీసీ, సైనికుల పిల్లలు, క్రీడా కోటా కింద దరఖాస్తు చేస్తున్న వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ద కన్వీనర్, యూజీ అడ్మిషన్స్, 2019 రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జి, టెక్నాలజీస్, ప్లాట్‌ నంబర్‌ 202, సెకండ్‌ ఫ్లోర్, ఎన్‌ఆర్‌ఐ బ్లాక్‌ సి, శ్రీమహేంద్ర ఎన్‌క్లేవ్, తాడేపల్లె, గుంటూరు జిల్లా 522501, ఆంధ్రప్రదేశ్‌ అనే చిరునామాకు జూలై 1లోగా స్పీడ్‌ పోస్ట్‌ లేదా రిజిస్టర్‌ పోస్ట్‌ ద్వారా దరఖాస్తులు పంపాలి. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కేవలం ఆన్‌లైన్‌లో పంపే దరఖాస్తులను ప్రాతిపదికగా తీసుకొని వారిని ప్రవేశాలకు ఎంపిక చేస్తారు. 

నాలుగు ట్రిపుల్‌ ఐటీలకు ఒకే దరఖాస్తు
ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు అభ్యర్థులు ఏపీ ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు, ఫీజు, ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ. 150, ఎస్సీ, ఎస్టీల అభ్యర్థులు రూ.100, అదనంగా రూ.25 ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లిం చాలి. నాలుగు ట్రిపుల్‌ ఐటీలకు ప్రాధాన్యతను చూపుతూ ఒకే దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యేక కేటగిరీ వారు మాత్రమే తమ రిజర్వేషన్‌ ప్రింట్‌ ఔట్లు, ధ్రువీకరణ పత్రాలను జిరాక్స్‌ చేసి వాటిపై విద్యార్థి సంతకంతో పంపాలి. దరఖాస్తులో మొదటి, రెండు, మూడు, నాలుగు ప్రాధాన్యాలను వెల్లడి చేస్తూ అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ట్రిపుల్‌ ఐటీలో ఎంపికైన విద్యార్థుల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతారు. విద్యార్థులకు ఈ–మెయిల్, సెల్‌ఫోన్‌లకు మెసేజ్‌ల ద్వారా సమాచారం అందిస్తారు. పోస్టల్‌ ద్వారా కూడా ఉత్తరం పంపుతారు.  

విద్యార్హతలు
2019లో పదో తరగతి లేదా తత్సమానమైన పరీక్షలో రెగ్యులర్‌ విద్యార్థిగా ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 31 డిసెంబర్‌ 2019 నాటికి 18 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 21 ఏళ్లు. 

మరిన్ని వార్తలు