అవినీతి ఖాకీ, అక్రమాల ఖద్దరు కలిస్తే ఏమవుతుంది?

19 Oct, 2014 01:10 IST|Sakshi
అవినీతి ఖాకీ, అక్రమాల ఖద్దరు కలిస్తే ఏమవుతుంది?

అవినీతి ఖాకీ, అక్రమాల ఖద్దరు కలిస్తే ఏమవుతుంది.. ఓ అసాంఘిక శక్తి  పేట్రేగిపోతుంది. ప్రశాంతతకు మారుపేరైన మన జిల్లాలోని పెదవేగి మండలం పినకడిమిలో సరిగ్గా ఇదే జరిగింది. విజయవాడ కమిషనరేట్, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల పోలీసులకు మూడు వారాలుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ‘పెదఅవుటపల్లి’ ట్రిపుల్ మర్డర్స్ కేసులో ప్రధాన నిందితుడు భూతం గోవిందు పెను‘భూతం’లా మారడం వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఏ పని చేసినా నాకేంటి అని లెక్కలు వేసుకునే ఓ అవినీతి పోలీస్ అధికారి, వివాదాలతోనే రాజకీయ భవిష్యత్‌కు పునాది వేసుకున్న ఓ నాయకుడు తెరవెనక ఉండి ప్రోద్బలం ఇవ్వడం వల్లనే గోవిందు లండన్‌లోని గార్డియన్, సండే టైమ్స్ వంటి పత్రికల వారు సైతం ఆరా తీసేంతటి ఘరానా నేరస్తుడిగా రూపాంతరం చెందాడన్న వాదనలు వినిపిస్తున్నాయి.
 
 సరిగ్గా పద్నాలుగేళ్ల కిందట అప్పటి పినకడిమి సర్పంచ్ గురవయ్యతో చోటుచేసుకున్న వివాదం నేపథ్యంలో భూతం గోవింద్‌కు స్థానికంగా ఉన్న పోలీస్ అధికారితో, స్థానిక రాజకీయ నేతతో పరిచయం ఏర్పడింది. అక్కడి నుంచి మొదలుకుని సదరు పోలీస్ అధికారితో, ప్రజాప్రతినిధితో పెనవేసుకుపోయిన బంధం ఇప్పటికీ కొనసాగుతోందని అంటున్నారు. బతుకుదెరువు కోసం జాతకాలు చెప్పుకునే గోవింద్ దేశ, విదేశాల్లో తిరిగేంతటి రూ.కోట్ల నగదు, పెదవేగిలో 10 ఎకరాలు, పినకడిమిలో 50 ఎకరాలు, కొప్పాకలో 20 ఎకరాలు, కృష్ణా జిల్లా నూజివీడు సమీపంలోని దిగవల్లిలో 30 ఎకరాల మామిడితోట కలిపి మొత్తంగా 100 ఎకరాలకు పైగా స్థిరాస్తులు ఎలా కూడబెట్టాడనేది మిస్టరీగా మారింది. తాను ఆర్థికంగా ఎదుగుతూ, తనకు తొలి దశలో అండగా నిలిచిన పోలీస్, రాజకీయ నేతకు ఆసరాగా ఉంటూ  ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకున్నాడని అంటున్నారు.
 
 ఆ అధికారికి మూడెకరాలు
 మొదటి నుంచీ తనకు అన్నివిధాలా సహకరిస్తున్న పోలీసు అధికారికి పినకడిమి సమీపంలోని దుగ్గిరాల రెవెన్యూ గ్రామ పరిధిలో మూడెకరాల పొలాన్ని గోవింద్ కొనిపించి ఇచ్చాడని అంటున్నారు. గతంలో ఆ పోలీసు అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ ఉచ్చులో పడి సస్పెండైన సందర్భంలోనూ గోవింద్ లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఆయనకు పోస్టింగ్ వచ్చేలా సహకారం అందించారని తెలుస్తోంది. ఇక ఏలూరు నగరంలో ఆ పోలీస్ అధికారి కట్టుకుంటున్న ఇంటి కోసం కూడా తనవంతు సహకారం అందించారన్న ప్రచారం ఉంది.
 
 ముంబై నుంచి రాజకీయ నేత సోదరుడి అకౌంట్‌కు సొమ్ము
 పినకడిమిలో రెండువర్గాల మధ్య దూరం పెంచి ఇరువురి నుంచి డబ్బులు  తీసుకుని పబ్బం గడుపుకున్న ఓ రాజకీయ పార్టీ నేత వ్యవహారాన్ని పరిశీ లిస్తే.. ఈ ఏడాది ఏప్రిల్‌లో భూతం దుర్గారావు హత్య కేసులో నిందితులైన గంధం నాగేశ్వరరావు, అతని సంబంధీకులు సదరు రాజకీయ పార్టీ నేతనే తొలుత ఆశ్రయించారు. ఆ నాయకుడి ఇంట్లోనే ఒకట్రెండు రోజులు ఆశ్రయం పొందారు. ఆ నాయకుడి బంధువులు ఆ సందర్భంలో వీరికి రూ.లక్ష ఇవ్వగా, ముంబై పరారయ్యారు. ఆ తర్వాత ముం బై నుంచి నేరుగా రాజకీయ నేత సోదరుడి బ్యాంక్ అకౌంట్‌లో తాము తీసుకున్న రూ.లక్షతోపాటు మరో రూ.5 లక్షలు వేశారు.
 

మరిన్ని వార్తలు