త్రిసభ్య కమిటీ బృందం పర్యటన

23 Dec, 2014 02:32 IST|Sakshi

శంకరభారతీపురం ఉన్నతపాఠశాలలో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలపై పరిశీలన
నరసరావుపేట రూరల్: సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ బృందం జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం లింగంగుంట్ల కాలనీలోని శంకరభారతీపురం ఉన్నత పాఠశాలను సందర్శించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాల పరిశీలనలో భాగంగా నరసరావుపేట విచ్చేసింది. బృందసభ్యులు గుప్తా, వి.శర్మ, వెంకటేశ్వరరావులతోపాటు వచ్చిన జిల్లా విద్యాశాఖాధికారి కేవీ శ్రీనివాసులురెడ్డి ఆయా వివరాలను తెలియచేశారు.

ఉన్నతపాఠశాలకు వచ్చిన బృందం పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యను తెలుసుకొని ఉన్న మరుగుదొడ్లను పరిశీలించారు. ప్రధానోపాధ్యాయుడు ఎం.ఎస్.ఆర్.కె. ప్రసాద్ వివరాలు తెలిపారు. బాలబాలికలకు వేర్వేరుగా ఉన్న మరుగుదొడ్లను బృంద సభ్యులకు హెచ్‌ఎం చూపించారు. విద్యార్ధుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఇవి ఏవిధంగా సరిపోతున్నాయంటూ వారు హెచ్‌ఎంను ప్రశ్నించారు. నూతనంగా మరో 12 మరుగుదొడ్లను నిర్మిస్తున్నట్లు సమాధానమిచ్చారు. నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లను కూడా వారు పరిశీలించారు.

పాఠశాలలో తాగునీటి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు తరగతి గదికి అందుబాటులో మంచినీళ్ల క్యాన్‌లను ఏర్పాటుచేయాలని సూచించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన జాతీయ నేతలు, శాస్త్రవేత్తలు విగ్రహాలను చూసిన బృంద సభ్యులు మెచ్చుకున్నారు. పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణపై బృంద సభ్యులు సంతృప్తి వ్యక్తంచేశారు. బృందం వెంట సర్వశిక్ష అభియాన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వై.నరసింహులు, డిప్యూటీ ఈఈ ఏఎల్‌ఎన్ ప్రసాద్, ఏఈ బీవీ నాగేశ్వరరావు ఉన్నారు.

మరిన్ని వార్తలు