నారీమణీ నీకు వందనం!

8 Mar, 2018 11:05 IST|Sakshi
జిలానీబేగంగౌష్య

వైకల్యాన్ని అధిగమించి ఉన్నతోద్యోగం

సబ్‌ రిజిస్ట్రార్‌గా జిలానీ బేగం గౌసియా

అనకాపల్లి: అంగవైకల్యం ఆమె ముందు తలవంచింది. పుట్టుకతోనే మరుగుజ్జుగా ఉన్నా ఏనాడూ అధైర్యపడలేదు. మిగిలినవారికి స్ఫూర్తిగా, మహిళలకు ప్రేరణగా నిలుస్తున్నారు అనకాపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ జిలానీబేగం గౌసియా.  మదీన్‌షా, కాదూన్‌బేబీ దంపతులకు ఐదుగురు సంతానం. వారికి కలిగిన పిల్లల్లో నాలుగో సంతానమైన గౌష్య చిన్నప్పటి నుంచి మరుగుజ్జు. అయినా మొక్కవోనిదీక్ష ఆమెను ఉన్నతస్థాయికి తీసుకెళ్లింది. మరుగుజ్జునని బాధపడకుండా బాగా చదువులో రాణించి ఉన్నతస్థాయికి వెళ్లడమే లక్ష్యంగా ముందుకు దూసుకుపోయారు.

విశాఖ శివాజీపాలెంలోని ప్రాథమిక పాఠశాలలో చదివిన ఆమె ఆంధ్రాయూనివర్సిటీ హైస్కూల్లో ఉన్నత తరగతులు, కృష్ణా కళాశాలలో ఇంటర్, డిగ్రీ చదివారు. తర్వాత ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ చేసిన ఆమె ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2009లో గ్రూప్‌–2లో సబ్‌రిజిస్ట్రార్‌గా ఎంపికై టెక్కలి, కొత్తవలస, ప్రస్తుతం అనకాపల్లిలో సబ్‌రిజిస్ట్రార్‌గా పని చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఈమెను నర్సీపట్నానికి డిప్యుటేషన్‌పై పంపారు. ఆరోగ్యంగా బాగా ఉండి జీవనోపాధి లేదని ఆలోచించకుండా కష్టించేతత్వం ఉంటే ఉన్నతస్థానాలకు వెళ్లవచ్చని గౌష్య చెబుతున్నారు. లక్ష్యంతో కృషి చేస్తే విజయం తమ దరి చేరుతుందని ఆమె పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు