భారీ వర్షంతో రాజధానిలో నరకయాతన

24 Oct, 2013 16:47 IST|Sakshi
భారీ వర్షంతో రాజధానిలో నరకయాతన

 రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ వాసులు హడలెత్తిపోతున్నారు. కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నగర జీవితం నరకప్రాయంగా మారింది. రోడ్లు చాలావరకు నదులు, కాలువలను తలపిస్తుంటే.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీరు ముంచెత్తుతుండడంతో నగరంలో  ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. ఒక కిలోమీటరు దూరం వెళ్లడానికే దాదాపు గంట సమయం పడుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు.. వేటిలో వెళ్లినా ఇదే పరిస్థితి.

నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటంతో చిన్న చినుకు పడితే చాలు.. నీళ్లు ఎక్కడికక్కడ నిల్వ ఉండిపోతున్నాయి. దీనికి తోడు పెద్దపెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. ఇక మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. దీంతో రోడ్డుపై ప్రయాణించాలంటేనే వాహన చోదకులు బెంబేలెత్తిపోతున్నారు. ఎక్కడ గుంత ఉందో.. మ్యాన్ హోల్ తెరుచుకుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన భయంకర పరిస్థితి. నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. కొన్ని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో గోడలు కూలిపోతున్నాయి.

బుధవారం నాటి వర్షానికి జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, మాసాబ్ ట్యాంక్, లక్డీకా పుల్, ఆబిడ్స్, కోఠీ, మలక్ పేట, మూసారాం బాగ్, దిల్ సుఖ్ నగర్ లాంటి ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. మెట్రో రైలు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో అయితే, సగానికి పైగా రోడ్డును మెట్రో రైలు కోసం ఆక్రమించుకోవడం, మిగిలిన కొద్దిపాటి రోడ్డు అప్పటికే ఎంతో కొంత ఆక్రమణలకు గురికావడంతో ఆ మధ్య ఉన్న కొద్దిపాటి ఖాళీ లోంచి వాహనాలు వెళ్లలేక, ఆగలేక నానా అవస్థలు పడాల్సి వస్తోంది. మామూలు రోజుల్లోనే ఇలాంటి ప్రాంతాల్లో సమస్య ఉందంటే, ఇక వర్షం వచ్చినప్పుడు అసలు చెప్పనక్కర్లేదు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా