మమ్మల్ని ఇబ్బంది పెట్టడమే మీ లక్ష్యమా..!

2 Jun, 2014 01:17 IST|Sakshi
మమ్మల్ని ఇబ్బంది పెట్టడమే మీ లక్ష్యమా..!

జి.సిగడాం, న్యూస్‌లైన్ : జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు పలు అభివృద్ధి కార్యక్రమాలు అంటూ  సర్పంచ్‌లను ఇబ్బంది చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని పలువురు సర్పంచ్‌లు ధ్వజమెత్తారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో పారిశుద్ధ్య వారోత్సవాల సందర్బంగా సర్పంచ్‌లకు, మండల స్థాయి అధికారులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పలు గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు మాట్లాడుతూ పారిశుద్ధ్య సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికిప్పుడే సమాచారం అందించి కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించడం మంచి పద్దతి కాదన్నారు. పంచాయతీల్లో నిధులు లేక డ్రెయిన్లలో పూడికలు కూడా తీయలేని పరిస్థితి నెలకొందన్నారు. సర్పంచ్ తమ సొంత సొమ్ములతో వాటిని నిర్వహిస్తే 50 వేల వరకు ఖర్చు అయితే రికార్డుల్లో మాత్రం 5వేలకు మించి అధికారులు నమోదు చేయడంలేదని ఆవేధన వ్యక్తం చేశారు.
 
  దవలపేట, దేవరవలస, జగన్నాథవలస, బాతువ, మెట్టవలస, పెంట  సర్పంచ్‌లు కంచరాన సూరన్నాయుడు, పంచిరెడ్డి బంగారునాయుడు, తనుబుద్ది దాలినాయుడు, కామోదుల సీతారాం, తిరుమరెడ్డి గౌరీశంకరరావు, మక్క సాయిబాబునాయుడు మాట్లాడుతూ పారిశుధ్య వారోత్సవాల కోసం సర్పంచ్‌లు సమావేశానికి హాజరైనా పూర్తిస్థాయిలో అధికారులు హాజరవ్వకపోవడంపై నిరసన తెలిపారు. ప్రజా ప్రతినిధులు అంటే మీకొక అలుసా, ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికి మేము వస్తున్నాం, మీ అధికారులు మాత్రం సమావేశానికి హాజరు కావడం లేదంటూ ఎంపీడీవో వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుధ్య వారోత్సవాలలో భాగంగా జిల్లా అధికారులు స్పందించి గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయించినప్పుడే వారోత్సవాలకు భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. దీనిపై ఎంపీడీవో స్పందిస్తూ మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ బి. హనుమంతురావులతో పాటు సర్పంచ్‌లు బత్తుల సన్యాసిరావు, పొగిరి అక్కలనాయుడు, పల్లంటి సురేష్, గోపాలకృష్ణరాజు, వాన ప్రమీల, మర్రిబందల లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు