తెలంగాణకు కలెక్టర్ రఘునందన్‌రావు

3 Jan, 2015 06:54 IST|Sakshi
తెలంగాణకు కలెక్టర్ రఘునందన్‌రావు
  • రేపు లేదా ఎల్లుండి రిలీవ్ అయ్యే అవకాశం
  • మచిలీపట్నం : కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు తెలంగాణ రాష్ట్రానికి బదిలీ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ ప్రాంతానికి కేటాయించిన ఐఏఎస్ అధికారుల జాబితాలో ఆయన ఉన్నారు. దీంతో కలెక్టర్ బదిలీ అనివార్యమైంది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆయన తెలంగాణ ప్రాంతానికి బదిలీ అవుతారనే ప్రచారం జరుగుతూనే ఉంది.

    ఈ నెల 4 లేదా 5వ తేదీల్లో కలెక్టర్ బదిలీకి సంబంధించిన ఉత్తర్వులు వస్తాయని, వెంటనే రిలీవ్ అవుతారని సమాచారం. రఘునందన్‌రావు జిల్లా కలెక్టర్‌గా 2013, అక్టోబరు 14వ బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే నంబరు నెలలో వరుసగా సంభవించిన హెలెన్, లెహర్ తుపానుల సందర్భంగా అధికారులను అప్రమత్తం చేసి సమర్థంగా పనిచేశారు.

    పరిపాలనా అవసరాల దృష్ట్యా ఆయన వారంలో మూడు రోజులు జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో, విజయవాడ క్యాంపు కార్యాలయంలో నాలుగు రోజులపాటు విధులు నిర్వర్తిస్తున్నారు. గత ఏడాది జరిగిన స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలను సమర్థంగా నిర్వహించారు. సమైక్యాంద్ర ఉద్యమ సమయంలోనూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గవర్నర్ పాలన సమయంలోనూ పారదర్శకంగా వ్యవహరించారు.

    ప్రజలతో మమేకమై ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా అచ్చ తెలుగులోనే మాట్లాడే కలెక్టర్‌గా రఘునందన్‌రావు పేరు తెచ్చుకున్నారు.కలెక్టర్ రఘునందన్‌రావు బదిలీ అనివార్యం కావడంతో నూతన కలెక్టర్‌గా ఎవరు వస్తారనే అంశం చర్చనీయాంశంగా మారింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేసిన ప్రద్యుమ్న కలెక్టర్‌గా వచ్చే అవకాశం అధికంగా ఉందని అధికారులు చెబుతున్నారు.
     

మరిన్ని వార్తలు