గండ్రతో టీఆర్‌ఎస్ మంతనాలు

26 Jan, 2014 02:17 IST|Sakshi
గండ్రతో టీఆర్‌ఎస్ మంతనాలు


  సీఎం నోటీసు, రాజ్యసభ ఎన్నికలపై చర్చ
 పెద్దల సభకు కేకే పోటీపై కొనసాగుతున్న అస్పష్టత
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లుపై స్పీకర్‌కు సీఎం నోటీసు, రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఖరి తదితర అంశాలపై టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు శనివారం ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డితో చర్చించారు. టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, శాసనసభ్యులు ఈటెల రాజేందర్, కె.తారకరామారావు, ఏనుగు రవీందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దాస్యం వినయ్ భాస్కర్‌లు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలోనే గండ్రతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్‌కు నోటీసును ఇచ్చే అధికారం రాజ్యాంగబద్ధంగా లేదని, ఈ నోటీసులో చాలా తప్పులున్నాయని విశ్లేషించారు. దీనిపై లోతుగా చర్చించి రాజ్యాంగంలోని అంశాలను, శాసనసభా నిబంధనలను ఉదహరించాలని నిర్ణయించారు.
 
  సీఎం కిరణ్ వ్యవహార శైలిని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యతిరేకించే విధంగా సమన్వయం చేయాలని గండ్రను కేకే కోరారు. స్పీకర్‌కు నోటీసు ఇచ్చామని సీమాంధ్రలో ప్రచారం చేసుకోవడానికి తప్ప.. దీనిద్వారా తెలంగాణ ఏర్పాటుకు జరిగే నష్టం ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం వైఖరి ఏమిటని గండ్రను టీఆర్‌ఎస్ నేతలు ఆరా తీశారు. అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా పనిచేయడం మినహా తెలంగాణ నేతలు ఈ విషయంలో చేయగలిగేదేమీ ఉండదన్నారు. స్పీకర్ కు సీఎం ఇచ్చిన లేఖలో చాలా లోపాలున్నాయని, వాటిపై ఆదివారం వివరంగా చెప్తానని కేకే అన్నారు.  మరోవైపు మంత్రి జానారెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళుతున్న నేపథ్యంలో ఆయనతో కేకే ఫోన్లో మంతనాలు జరిపారు. రాజ్యసభకు కాంగ్రెస్ తరపున ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దింపితే టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కేకే రంగంలోకి దిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కేకేకు టీఆర్‌ఎస్ నుంచి రాజ్యసభ సభ్యునిగా అవకాశమిస్తే రెండు పార్టీల మధ్య వారధిగా పనిచేయడానికి వీలుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది.
 
 పోటీ ఉంటే దూరమే మేలు..
 కాంగ్రెస్ తరపున నలుగురు సభ్యులను పోటీకి దించితే తమ పార్టీ అభ్యర్థి పోటీ చేయకుండా ఉండటమే మేలని టీఆర్‌ఎస్ సీనియర్ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ముగ్గురు అభ్యర్థులను మాత్రమే రంగంలోకి దించితే టీఆర్‌ఎస్ అభ్యర్థిని పెట్టాలని, లేకుంటే పోటీకి వెళ్లొద్దని సూచిస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు