టీఆర్‌ఎస్ టార్గెట్ @ 2014

8 Nov, 2013 01:01 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :
 2014 ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి అడుగులు వేస్తోంది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధమైంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం తెచ్చింది తామేనంటూ కాంగ్రెస్ నేతలు జైత్రయాత్ర పేరిట సభలు నిర్వహిస్తుండటం.. తమ మద్దతు, ఒత్తిడితోనే తెలంగాణ వచ్చిందని బీజేపీ నినదిస్తుండటంతో తెలంగాణ తమతోనే సాధ్యమైందని చాటేందుకు టీఆర్‌ఎస్ కేడర్‌ను సంసిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే తీవ్రస్థాయిలో కసరత్తు చేసిన టీఆర్‌ఎస్ అధిష్టానం బుధవా రం హైదరాబాద్‌లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహిం చింది. ఈ మేరకు ఈ నెల 14 నుంచి గ్రామస్థాయిలో కార్యకర్తలకు శిక్షణ నిర్వహించాలని మార్గదర్శనం చేసింది. నియోజకవర్గానికి ఇద్దరు చొప్పు న రాష్ర్ట పరిశీలకులు, ఉపన్యాసకులను నియమించాలని సూచించింది.
 
 14 నుంచి డిసెంబర్ 10 వరకు శిక్షణ
 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌ను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు నాయకత్వం నడుం బిగించిం ది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో టీఆర్‌ఎస్ విలీనం అవుతుందని.. లేదంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తుందన్న ప్రచారం ఇటీవల తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఊహాగానాలు, ప్రచారాలకు తెరతీసే విధంగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం నాయకత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ అధిష్టానం బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పొలిట్‌బ్యూరో సభ్యులతో కీలక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా 2014 ఎన్నికలు లక్ష్యంగా పలు అంశాలకు చర్చకు వచ్చినట్లు సమాచారం. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఈ నెల 14 నుంచి డిసెంబర్ 10 వరకు గ్రామస్థాయి కార్యకర్తల శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అయితే తూర్పు జిల్లాలో మాత్రం 14 నుంచి 28 వరకు సాగుతాయి. తూర్పులో నార్నూరు నుంచి.. పశ్చిమలో ఖానాపూర్ నుంచి శిక్షణ కార్యక్రమాలు మొదలు కానున్నాయి. ఈ సందర్భంగా 14 నుంచి నిర్వహించే శిక్షణలో ఆవిర్భావం నుంచి పార్టీ చూపిన పోరాట పటిమ, ఉద్యమంలో ఎదుర్కొన్న ఇబ్బందులను ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలకు వివరించనున్నారు.
 
 రోజు రెండు నియోజకవర్గాల్లో కార్యక్రమాలు
 14 నుంచి మొదలయ్యే కార్యకర్తల శిక్షణ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించేందుకు పార్టీ ప్రణాళిక రూపొందించింది. రోజు రెండు నియోజకవర్గాల్లోని రెండు మండలాలు ఎంపిక చేసుకుని అక్కడే జిల్లా నాయకులు, రాష్ట్ర పార్టీ నుంచి ఇద్దరు పరిశీలకులు హాజరవుతారు. పా ర్టీ సంస్థాగత బలోపేతానికి తీసుకోవాల్సిన చ ర్యలను పరిశీలకులు కేడర్‌కు వివరిస్తారు. రాష్ట్ర పార్టీ నుంచి వచ్చే పరిశీలకుల్లో ఒకరు పార్టీ విధి విధానాలను, మరొకరు ప్రస్తుత రాజకీయ పరి స్థితులు.. కార్యకర్తలు అనుసరించాల్సిన విధానాలపై కార్యకర్తలకు దిశానిర్ధేశనం చేస్తారు. అలాగే పార్టీ కార్యాచరణ, ఉద్యమావసరాలు, భవిష్యత్ వ్యూహం, పార్టీ అవసరాలు తదితర అంశాలపై కార్యకర్తలకు వివరించేందుకు ఉపన్యాసకులను కూడా నియమించనున్నారు. అయితే ఉపన్యాసకులు, పరిశీలకుల వివరాలను పార్టీ అధిష్టానం 11న ప్రకటించనుంది. జిల్లా వ్యాప్తంగా 14న మొదలయ్యే ఈ కార్యక్రమాలు సుమారు 16 రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో ఆ విజయం తమదిగా ప్రజలకు వివరించడంతో పాటు 2014 ఎన్నికలు లక్ష్యంగా ముందస్తుగా సన్నద్ధం కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
 
 సంస్థాగతంగా పార్టీని     బలోపేతం చేయడానికే..
 ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ పార్టీ ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కలల సాకారం కాబోతోంది. త్వరలో ఏర్పడే రాష్ట్రాన్ని పటిష్టంగా పునర్ నిర్మించుకోవడంలో టీఆర్‌ఎస్‌దే కీలక పాత్ర. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసుకుని, పార్టీ కేడర్‌కు పరిస్థితులు వివరించేందుకు పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రామస్థాయిలో జిల్లా వ్యాప్తంగా కార్యకర్తల శిక్షణ తరగతులు నిర్వహించనున్నాము.
 - పురాణం సతీష్,
 తూర్పు జిల్లా అధ్యక్షుడు, టీఆర్‌ఎస్

మరిన్ని వార్తలు