గణాంకాలు చెప్పి మభ్యపెట్టే యత్నం

11 Aug, 2013 04:26 IST|Sakshi

 కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గణాంకాలు చెప్పి సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నిత్యానందరెడ్డికి శనివారం సాయంత్రం ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ గణాంకాలు చెప్పడం గొప్పతనం కాదని, సమైక్య రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఓవైపు పదవిలో ఉంటూ ప్రజలకు నీతులు చెబుతారా? అంటూ ప్రశ్నించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులిబిడ్డలా రాజీనామా చేసి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారన్నారు. గతంలో ఇందిరాగాంధీ విదేశీ అరాచక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదేపదే చెప్పేవారని, కానీ తన కోడలే ఒక అరాచక శక్తి అని ఆమె గ్రహించలేకపోయిందన్నారు. సీమాంధ్రలోని కొందరు నాయకులకు మంత్రి పదవులు ఎరగా వేసి విభజన నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. విభజన జరుగుతుందని తెలిసి కూడా మౌనంగాఉన్న నేతలను సమైక్య వాదులు నిలదీయాలని పిలుపునిచ్చారు.
 
 సీఎం, చంద్రబాబు రాజీనామా చేయాలి
 : రఘురామిరెడ్డి
 ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు దమ్ముంటే రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని వైఎస్సార్ సీపీ క్రమశిక్షణా కమిటీ సభ్యుడు రఘురామిరెడ్డి సవాల్ విసిరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించిఉంటే రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. చేతగాని ముఖ్యమంత్రి, మంత్రులు రాయలసీమను ఎడారిగా చేయడానికే విభజన నిర్ణయం తీసుకుంటున్నా మౌనంగా ఉన్నారని విరుచుకుపడ్డారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ విజయమ్మ రాజీనామాలు చేయడం శుభపరిణామమన్నారు. కాంగ్రెస్, టీడీపీలు ఏకమై రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయని మండిపడ్డారు.నిత్యానందరెడ్డికి మద్దతు ప్రకటించిన వారిలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, రామకృష్ణ కళాశాల కరాస్పాండెంట్ కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు.
 
 
 

మరిన్ని వార్తలు