మా ఆకాంక్షలకు తగ్గట్టుగా లేదు

27 Dec, 2013 00:43 IST|Sakshi

 కొన్ని అంశాలను పునఃపరిశీలించండి  
టీ-బిల్లుపై రాష్ట్రపతి ప్రణబ్‌కు కేసీఆర్ వినతి

 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లులోని పలు అంశాలను పునఃసమీక్షించాలని టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేశారు. బిల్లులోని అంశాలు తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా లేవని తెలిపారు. శీతకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో గురువారం రాత్రి టీఆర్‌ఎస్ ప్రతినిధుల బృందం భేటీ అయింది. పార్టీ అధినేత కేసీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సహా 28 మంది నేతలు రాష్ట్రపతిని కలిసి పది పేజీల వినతిపత్రం అందజేశారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అభిప్రాయాలను కోరుతూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను చాలా త్వరగా రాష్ట్ర అసెంబ్లీకి పంపినందుకు నాలుగు కోట్ల ప్రజల తరుఫున మీకు ధన్యవాదాలు. చిరకాల స్వప్నంగా ఉన్న తెలంగాణ త్వరలో సాకారం కాబోతు న్న ఈ సమయంలో మీ వంటి వ్యక్తి దేశానికి రాష్ట్రపతి కావడం మా ఆదృష్టం. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ త్వరలోనే ముగింపునకు వస్తుందని విశ్వసిస్తున్నాం. బిల్లు ప్రస్తుతం అసెంబ్లీలో చర్చకు ఉంది.  పలు రాజకీయ శక్తులు అడ్డుకుంటున్నా.. చర్చ పూర్తి చేసుకొని ఈ బిల్లు తిరిగి వీలైనంత త్వరగా మీకు చేరుతుందనే విశ్వా సంతో ఉన్నాం. తెలంగాణ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులను గమనంలోకి తీసుకుంటే ప్రస్తుతం రూపొం దించిన బిల్లులోని కొన్ని అంశాలను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. సామాజిక, ఆర్థిక అంశాలలో తెలంగాణ ప్రజలు సమాన అవకాశాల కోసం దశాబ్దాల తరబడి పోరాడుతున్న సంగతి మీకూ తెలుసు. ముఖ్యం గా విద్య, ఉపాధి అవకాశాలతో పాటు నీరు, నిధుల కేటాయింపులో తగిన వాటా కోసం ఇక్కడి ప్రజలు పోరాడుతున్నారు. ప్రస్తుత బిల్లులో ఆయా అంశాలు ఇక్కడి ప్రజ ల ఆకాంక్షలకు తగిన విధంగా లేవు’’ అని రాష్ట్రపతికి అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు.

బిల్లులో పొందిపరిచిన అంశాలలో ఆస్తులు, అప్పుల పంపిణీ, ఉద్యోగులు, పెన్షనర్లలను రెండు రాష్ట్రాలకు పంచిన తీరు, శాంతిభద్రత విషయంలో గవర్నర్‌కు పత్య్రేక అధికారాలు కల్పిం చడం, రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు, నదీ జలాలకు పంపిణీకి ఉద్దేశించి కమిటీల ఏర్పాటు, విద్యుత్ రంగంలో వాటా అంశాలలో తమకున్న అభ్యంతరాలను వినతిపత్రంలో పేర్కొన్నారు. భేటీ జరిగిన 15 నిమిషాలపాటు కేసీఆర్ ఒక్కరే వినతిపత్రంలోని అంశాలను రాష్ట్రపతికి వివరించారు.
 
 అభ్యంతరాలను పరిశీలిస్తామన్నారు : ఈటెల

 బిల్లుపై తమ పార్టీ లేవనెత్తిన పలు అభ్యంతరాలను పరిశీలిస్తానని రాష్ట్రపతి అన్నట్లు టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నాయకుడు ఈటెల రాజేందర్ తెలిపారు. రాష్ట్రపతితో భేటీ అనంతరం  ఈటెల విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని రాష్ట్రపతిని కోరినట్లు చెప్పారు. హైదరాబాద్‌పై ఆంక్షలను పూర్తిస్థాయిలో తొలిగించాలని కోరామన్నారు. బిల్లుై పె అసెంబ్లీలో చర్చకు సీమాంధ్ర నేతలు మరింత గడువు కోరే అంశాన్ని కూడా రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చామని హరీష్‌రావు చెప్పారు. బిల్లుపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలందరూ పట్టుపట్టినా చర్చ జరపకుండా పారిపోయిన వారికి గడువు పెంచాలని అడిగే అర్హత లేదన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ఇంకా ఎవరైనా మాట్లాడితే మూర్ఖత్వమే అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ఆపుతామని ఎవరు మాట్లాడినా సీమాంధ్ర ప్రాంతంలో నాలుగు ఓట్లు సంపాదించుకోవడం కోసమేనని దుయ్యబట్టారు. బిల్లుపై చర్చకు రాష్ట్రపతి గడువు పెంచుతారని అనుకోవడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
 

మరిన్ని వార్తలు