‘మరో 30 ఏళ్లు వైఎస్‌ జగనే సీఎంగా ఉండాలి’

6 Nov, 2019 19:21 IST|Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆగమ సలహా మండలి సభ్యునిగా తనను నియమించినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి శ్రీవారి ఆలయ పూర్వ ప్రధాన అర్చకుడు ఏవీ రమణదీక్షితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని సీఎంపై ప్రశంసల వర్షం కురిపించారు. బుధవారం ఆగమ సలహా మండలి సలహా సభ్యుడిగా రమణదీక్షితులు బాధ్యతలు స్వీకరించారు. 

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, అర్చకులను కాపాడాలని, మరో 30 ఏళ్లు వైఎస్‌ జగనే సీఎంగా ఉండాలని ఆకాంక్షించారు.  సీఎం చేపట్టిన ధార్మిక కార్యక్రమాలతోనే రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నారు.  మరో వారంలో తనకు ప్రధాన అర్చక పదవి ఇవ్వనున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారన్నారు. సీఎం జగన్‌ రాష్ట్రంలోని ఆలయాలని అభివృద్ధి చేయడానికి అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.

బలవంతంగా పదవీ విరమణ చేయించారు
‘వందల సంవత్సరాలుగా శ్రీవారి కైంకర్యాలలో నాలుగు కుటుంబాలు తరిస్తు వస్తున్నాం. రాజుల, బ్రిటిష్ పాలనలో, కరువుకాటకాలు వచ్చినా స్వామివారికి మేము ఎప్పుడూ లోటు చెయ్యలేదు. అయితే అనతికాలంలో వంశపారంపర్యాన్ని రద్దు చేస్తూ చట్టం చేశారు. ఈ దుర్మార్గమైన చట్టాన్ని 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రద్దు చేశారు. తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ చట్టాన్ని విస్మరించింది. చట్టంలో, ఆగమ శాస్త్రంలో లేని రిటైర్మెంట్‌ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చి మాతో బలవంతంగా పదవీ విరమణ చేయించారు. 

అనంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎన్నికల సమయంలో అర్చకుల సమస్యను మేనిఫెస్టోలో పెట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం బలవంతంగా పదవీ విరమణ చేయించిన వారిని తిరిగి విధుల్లోకి తీస్కోనున్నారు. దీంతో అనేక సంవత్సరాల అర్చకుల కల నెరవేరింది. దీనిలో భాగంగానే నాకు ఆగమ సలహామండలి సభ్యునిగా అవకాశం కల్పించారు. నాతో పాటు మరో నలుగురు ప్రధాన అర్చకులకి ఈ అవకాశం ఇస్తార’ని రమణ దీక్షితులు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు