టీటీడీ బడ్జెట్టుపై తీవ్ర ఉత్కంఠ

24 Mar, 2018 09:24 IST|Sakshi

ప్రభుత్వ పరిశీలనలోనే ప్రతిపాదనలు

మార్చి నెల ముగుస్తున్నా అందని ఆమోదం

సందిగ్ధంలో పడిన అధికారులు

ఈలోగా...పక్కదారి పడుతున్న శ్రీవారి సొమ్ము

వారం రోజుల్లో మార్చి నెల ముగియనుంది. ఇంత వరకూ టీటీడీ వార్షిక బడ్జెట్టుపై స్పష్టత రాలేదు. అధికారుల తీరు చూస్తుంటే ‘సెనగలు తిని చేయి కడుక్కున్నట్లుంది. బడ్జెట్టు ప్రతిపాదనలను ఎప్పుడో ప్రభుత్వానికి పంపామ ని, రేపోమాపో అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభిస్తుందని చెబుతున్న టీటీడీ అ«ధికారులు రోజులు గడుస్తున్న కొద్దీ సందిగ్ధంలో పడుతున్నారు. బడ్జెట్టు విషయంలో నిత్యం ఉత్కంఠను చవిచూస్తున్నారు. ఏం జరుగుతుందో ఏమోనంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఏటా వ్యయ అంచనాలతో కూడిన వార్షిక బడ్జెట్టును టీటీడీ జనవరిలోనే సిద్ధం చేస్తుంది. జనవరి 15 లోగానే దీన్ని తయారు చేసి పాలక మండలి ముందుంచుతుంది. ప్రత్యేక సమావేశం ద్వారా బడ్జెట్టును ఆమోదించడం ఆనవాయితీ. ఈసారి టీటీడీలో ఊహించని విపత్కర పరిస్థితి నెలకొంది.  పది నెలలుగా ధర్మకర్తల మండలి లేదు. స్పెసిఫైడ్‌ అథారిటీ కూడా లేదు. నూతన పాలకమండలి ఏర్పాటుపై సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం కనబరిచారు. రాజకీయ సమీకరణల నేపథ్యంలో పాలకమండలి ఎన్నిక ప్రహసనంగా మారింది. ఇదిగోఅదిగో అంటూనే ప్రభుత్వం పది నెలలు నెట్టుకొచ్చింది. ఈ కాలంలో అధికారులే పాలనాపరమైన, ఆదాయ వ్యయాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఇప్పుడు కీలక సమయం ఆసన్నమైంది. ఏప్రిల్‌ మాసం మొదలైతే ఏ పనికి ఎంతెంత ఖర్చు పెట్టాలో, ఏయే పనులకు శ్రీవారి సొమ్ములను వినియోగించాలో బోధపడని పరిస్థితి. టీటీడీ హిందూ దేవాదాయ ధార్మిక చట్టం ప్రకారం పాలకమండలి లేకుండా అధికారులు నిధులు ఖర్చు చేయకూడదు. దేవాదాయ చట్టం కూడా ఇదే చెబుతోంది. ధర్మకర్తల మండలి లేనపుడు స్పెసిఫైడ్‌ అథారిటీ అన్నా ఉండాలి. అదీ లేనప్పుడు మేనేజ్‌మెంట్‌ కమిటీ అయినా ఉండాలి. ఇవేమీ లేకుండా తామే నిర్ణయాలు తీసుకున్నామని అధికారులు చెబితే రేపటి రోజున ఆడిట్‌ అధికారులకు, కొత్తగా వచ్చే ధర్మకర్తల మండలి సభ్యులకు ఎవరు సమాధానం చెబుతారన్నది ప్రశ్న. బోర్డు లేకుండా తీసుకున్న నిర్ణయాలన్నీ చట్టవిరుద్ధమని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

2018–19 వార్షిక బడ్జెట్టు ఎంత..
గత ఏడాది రూ.2,858 కోట్ల బడ్జెట్టుకు ఆమోదం లభించింది. ఈ ఏడాది సుమారు రూ.3 వేల కోట్ల మేర బడ్జెట్టు అంచనాలు ఉండవచ్చని అంటున్నారు. ఆదాయ వ్యయాలను బేరీజు వేసుకుని సంక్షేమ కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాలను నిర్వహించాల్సి ఉంది. ఏటా సుమారు రూ.570 కోట్లకు పైగా ఉద్యోగుల వేతనాలు, ఇంజినీరింగ్‌ పనులకు రూ.200 కోట్లు, హిందూ ధార్మిక ప్రచారం కోసం రూ.125 కోట్లు, ఉద్యోగుల పెన్షన్ల కోసం రూ.125 కోట్లు, విద్యా ఆరోగ్య సదుపాయాలకు రూ.112 కోట్లు, విజిలెన్సు విభాగానికి రూ.90 కోట్లు ఇలా విభాగాల వారీగా అయ్యే వార్షిక వ్యయాలను అంచనా వేసుకుని ఏడాది మొత్తం గా అయ్యే వ్యయాన్ని వార్షిక బడ్జెట్టుగా తయారు చేసి పంపుతుంటారు. ఆలయ చరిత్రలో ఎన్నడూ లేనట్లు ఈ ఏడాది పది నెలలుగా ధర్మకర్తల మండలి లేకపోవడం, బడ్జెట్టు విషయంలో సందిగ్ధత నెలకొనడం టీటీడీ వర్గాల్లో తీవ్ర గందరగోళాన్ని రేపుతోంది. పాలక మండలి లేకపోవడాన్ని అదునుగా తీసుకున్న టీటీడీ శ్రీవారి సొమ్ములను దుబారా చేస్తోందన్న ప్రచారం విస్తృతమైంది. ప్రభుత్వ పెద్దలకు భయపడి స్వామివారి నిధులను దారి మళ్లించి ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారని భక్త జనావళి మండిపడుతోంది.

మరిన్ని వార్తలు