టీటీడీ కొత్త పాలకమండలి నియామకం

19 Sep, 2019 03:41 IST|Sakshi

24 మంది సభ్యులు.. నలుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులను నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు

23న కొత్త సభ్యుల ప్రమాణం

 సాక్షి, అమరావతి/తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కొత్త పాలక మండలిని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని గత జూన్‌ 21న నియమించిన ప్రభుత్వం బుధవారం పాలక మండలిలోని మిగిలిన సభ్యుల్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ పాలక మండలిని 29 మంది సభ్యులకు పెంచుతూ ప్రభుత్వం ఇటీవల గెజిట్‌ జారీ చేయడం తెలిసిందే. గతంలో ఎక్స్‌అఫీషియో సభ్యులు కాకుండా 19 మందితో పాలకవర్గం ఉండేది. తాజా ఉత్తర్వుల్లో 24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులతో కూడిన కొత్త పాలకమండలిని ప్రకటించింది.విశాఖపట్నం జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు, వైఎస్సార్‌ జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే కె.పార్థసారథిలతో పాటు పరిగెల మురళీకృష్ణ, కృష్ణమూర్తి వైద్యనాథన్, నారాయణస్వామి శ్రీనివాసన్, జె.రామేశ్వరరావు, వేమిరెడ్డి ప్రశాంతి, బి.పార్థసారథిరెడ్డి, డాక్టర్‌ ముప్పవరపు నిశ్చిత, నాదెళ్ల సుబ్బారావు, డీపీ అనంత, రాజేష్‌శర్మ, రమేష్‌ శెట్టి, గుండవరం వెంకట భాస్కరరావు, మూరంశెట్టి రాములు, డి.దామోదరరావు, చిప్పగిరి ప్రసాదకుమార్, ఎం.ఎస్‌.శివశంకరన్, సంపత్‌ రవినారాయణ, సుధా నారాయణమూర్తి, కుమారగురు(తమిళనాడు ఎమ్మెల్యే), పుత్తా ప్రతాప్‌రెడ్డి, కె.శివకుమార్‌లు పాలకమండలి సభ్యులుగా నియమితులయ్యారు. దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, దేవదాయ శాఖ కమిషనర్, తుడా చైర్మన్, టీటీడీ ఈవోలను పాలకమండలిలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, నూతనంగా నియమితులైన టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు ఈ నెల 23న ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం. అనంతరం జరిగే కొత్త పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణ నుంచి టీటీడీ బోర్డు సభ్యులుగా నియమితులైన దివకొండ దామోదర్‌ రావు, వి.భాస్కర్‌ రావు, ఎం.రాములు బుధవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించారు. 

దీవకొండ దామోదర్‌రావు, ఉద్యమ నేత

తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించారు. నమస్తే తెలంగాణ, టీ న్యూస్‌ల ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన ఆ పత్రిక చైర్మన్‌గా, టీ న్యూస్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 2001 నుంచి టీఆర్‌ఎస్‌ పారీ్టలో వివిధ పదవుల్లో పనిచేశారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ప్రధాన కార్యదర్శిగా, పార్టీ ఫైనాన్స్‌ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. జగిత్యాల జిల్లా మద్దునూరు ఆయన స్వగ్రామం.  

వెంకట భాస్కరరావు, కావేరీ సీడ్స్‌ సీఎండీ

విత్తన ఉత్పత్తిలో తనకంటూ ప్రత్యేకత సాధించిన గుండవరం వెంకట భాస్కరరావు వ్యవసాయ రంగం పురోగతిలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. తొలినాళ్ల లో కరీంనగర్‌ జిల్లా గట్ల నరసింగాపూర్‌లో తన వ్యవసాయ క్షేత్రంలో విత్తన ఉత్పత్తికి బాటలు వేసిన ఆయన ప్రస్తుతం కావేరీ సీడ్స్‌ కంపెనీ లిమిటెడ్‌కు చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.  ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ.

జూపల్లి రామేశ్వరరావు, మై హోమ్‌ అధినేత

హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగం వేగం పుంజుకుంటున్న తరుణంలో రియల్టర్‌గా రంగప్రవేశం చేసి అనతికాలంలోనే మొదటి స్థానం దక్కించుకున్నారు జూపల్లి రామేశ్వరరావు. మై హోమ్‌ గ్రూపు స్థాపించి ఆ రంగంలో అత్యంత చురుకుగా వ్యవహరిస్తున్నారు.  ఆధ్యాతి్మకతలోనూ తనదైన పాత్ర పోషిస్తున్నారు. చిన జీయర్‌స్వామి ఆధ్వర్యంలో జరిగే ఆధ్యాతి్మక కార్యక్రమాల్లో ఆయన చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు.  

బండి పార్థసారథిరెడ్డి, హెటిరోడ్రగ్స్‌ అధినేత

ఔషధ రంగంలో తెలంగాణ ప్రాంతం నుంచి ప్రముఖ పాత్ర పోషిస్తున్న బండి పార్థసారథిరెడ్డి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న హెటిరో డ్రగ్స్‌ సీఎండీగా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీని స్థాపించటానికి పూర్వం ఆయన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌లో చీఫ్‌ టెక్నాలజిస్ట్‌గా దశాబ్దానికి పైగా పనిచేశారు. వీరితో పాటు తెలంగాణ నుంచి మూరంశెట్టి రాములు, పుత్తా ప్రతాప్‌రెడ్డి, కె.శివకుమార్‌లు పాలకమండలి సభ్యులుగా నియమితులయ్యారు. 

>
మరిన్ని వార్తలు