టీటీడీ బడ్జెట్‌ 3,243 కోట్లు

29 Dec, 2019 04:44 IST|Sakshi
టీటీడీ పాలక మండలి సమావేశంలో చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, సభ్యులు

2019–20 సవరణ బడ్జెట్‌ను ఆమోదించిన పాలక మండలి

టీటీడీ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు

జనవరి 6, 7న భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం

ఆంధ్రజ్యోతి పత్రికపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా

వారణాసి, జమ్మూలో శ్రీవారి ఆలయాల నిర్మాణం

తిరుమల: 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ.3,243.19 కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వార్షిక రివైజ్డ్‌ బడ్జెట్‌కు టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది. శనివారం తిరుమల అన్నమయ్య భవన్‌లో పాలక మండలి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. తిరుమలలో జరిగే పలు అభివృద్ధి పనులు, స్థానికుల సమస్యలపై టీటీడీ బోర్డు సభ్యులు చర్చించారు. అలాగే 2019–20కి సంబంధించిన బడ్జెట్‌ను టీటీడీ విడుదల చేసింది. హిందూ ధర్మ ప్రచారం, భక్తుల సౌకర్యాలు, దేవాలయ నిర్మాణాలు, విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిశుభ్రతకు ఈ బడ్జెట్‌లో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.
పాలక మండలి చర్చించిన ముఖ్యమైన అంశాలు

►భక్తుల మనోభావాలు దెబ్బతినేలా గత నెలలో ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైన కథనంపై రూ.100 కోట్ల క్రిమినల్‌ పరువు నష్టం దావా వేయాలని నిర్ణయం. టీటీడీ వెబ్‌సైట్‌లో యేసు ప్రభువు కనిపిస్తున్నాడని ఆ పత్రికలో ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ పరువు నష్టం దావా వేయనుంది.
►జనవరి 6న వైకుంఠ ఏకాదశి, 7న ద్వాదశి సందర్భంగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం. ప్రొటోకాల్‌ ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు.  
►2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను టీటీడీ రూ.3,116.25 కోట్లతో అంచనా బడ్జెట్‌ను రూపొందించగా, రూ.3,243.19 కోట్లుగా సవరించారు.  
►ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారణాసి, జమ్మూలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకారం. స్థలం కేటాయించాలని కోరుతూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయాలని నిర్ణయం.
►ముంబైలోని బాంద్రా ప్రాంతంలో రూ.30 కోట్లతో శ్రీవారి ఆలయం, టీటీడీ సమాచార కేంద్రం నిర్మాణానికి ఆమోదం.
►డీఎస్పీ స్థాయి అధికారితో ప్రత్యేకంగా సైబర్‌ సెక్యూరిటీ విభాగం ఏర్పాటు.
►రమణ దీక్షితులకు గౌరవ ప్రధానార్చకుల(హానరరీ బేసిస్‌) హోదా కల్పిస్తూ నిర్ణయం.
►టీటీడీలో ప్రత్యేక అకౌంటింగ్‌ విభాగం ఏర్పాటు.
►రూ.14 కోట్ల అంచనా వ్యయంతో తిరుమలలోని శ్రీ వరాహస్వామివారి ఆలయ విమానానికి రాగిరేకులపై బంగారు తాపడం పనులు చేపట్టేందుకు ఆమోదం. ఇందుకు అవసరమైన బంగారాన్ని టీటీడీ ఖజానా నుండి తీసుకునేందుకు అనుమతి.
►చెన్నై అపోలో ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్‌ మదన్‌మోహన్‌రెడ్డిని బర్డ్‌ ఆసుపత్రి డైరెక్టర్‌గా(హానరీ బేసిస్‌) నియమిస్తూ నిర్ణయం.
►తిరుపతిలోని శ్రీ పద్మావతి, శ్రీశ్రీనివాస కల్యాణ మండపాల్లో రూ.3.20 కోట్లతో సెంట్రలైజ్డ్‌ ఏసీ ఏర్పాటు.
►రెండో ఘాట్‌ రోడ్‌లో రూ.10 కోట్ల వ్యయంతో ఆర్‌సీసీ క్రాష్‌ బ్యారియర్లు, సీసీ కెర్బ్‌ వాల్స్‌ నిర్మాణం.
►తిరుమల ఘాట్‌ రోడ్లలో మరమ్మతులు చేపట్టేందుకు ఐఐటీ చెన్నై, జేఎన్‌టీయూ నిపుణులతో కమిటీ ఏర్పాటు.
►తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో రూ.14.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆమోదం.

మరిన్ని వార్తలు