లడ్డూ ధర పెంపుపై నిర్ణయం తీసుకోలేదు 

18 Nov, 2019 04:08 IST|Sakshi

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

తిరుమల/సాక్షి ప్రతినిధి, చెన్నై: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూ ధర పెంచే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. చెన్నై టీనగర్‌లోని టీటీడీ ఆలయానికి కొత్తగా నియమితులైన స్థానిక సలహామండలి ఉపాధ్యక్షులు, సభ్యుల చేత ఆదివారం ఆయన పదవీ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోని అన్ని శ్రీవారి ఆలయాలకు స్థానిక సలహామండలి సభ్యుల నియామకాలు పూర్తి చేశారని చెప్పారు.

భక్తులను ఇబ్బందిపెట్టే ఎలాంటి నిర్ణయాన్నీ పాలకమండలి తీసుకోదన్నారు. అద్దె గదుల విషయంలోనూ సామాన్య భక్తులు తీసుకునే వాటి ధరలు పెంచలేదని స్పష్టం చేశారు. చెన్నైలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం భూమి కేటాయించాలని తమిళనాడు సీఎంతో ఇప్పటికే మాట్లాడినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న మందిరానికి మెరుగులు దిద్దుతామన్నారు. 23 నుంచి తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని, అదే రోజున చెన్నైలోనూ ప్రారంభిస్తామని చెప్పారు. 

మరిన్ని వార్తలు