‘సీఎం జగన్‌ వారి ఆశయాలను అమలు చేస్తున్నారు’

12 Feb, 2020 14:38 IST|Sakshi
టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఎల్లో మీడియాకు కనిపించడం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ: దళితులను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్‌ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రేవేశపెడుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మహాత్మా గాంధీ, అంబేద్కర్‌ ఆశయాలను ఆయన అమలు చేస్తున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలను 6 నెలల్లో అమలు చేశారని, ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా సీఎం జగన్‌ అమలు చేశారని తెలిపారు. దళితుల కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క కార్యక్రమం అయినా చేశారా అని ఆయన ప్రశ్నించారు.

కాగా.. మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్‌ అమలు చేశారన్నారు. పేద పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో అంగ్ల విద్యను అమలు చేస్తున్న గొప్ప నేత సీఎం జగన్‌ అన్నారు. రాష్ట్రానికి రూ. 3 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, మరోక లక్షల కోట్లు తెచ్చి రాజధానిని నిర్మిస్తే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను చంద్రబాబు పట్టించుకోలేదని, రాజధానిలో రోడ్లు కూడా బాబు వేయలేదని విమర్శిచారు. ఇక అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతే సీఎం జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని, రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారం మోపకూడదనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు