బ్రహ్మోత్సవాల రోజుల్లో దాతలకు మాత్రమే గదులు

26 Aug, 2018 03:43 IST|Sakshi

టీటీడీ నిర్ణయం

తిరుమల: శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆయా రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజీ దాతలకు మాత్రమే గదులు కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమలలో సెప్టెంబర్‌ 13 నుంచి 21 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్‌ 10 నుంచి 18 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్‌ 17న గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్‌ 15 నుంచి 17 వరకు కాటేజీ దాతలకు ఎలాంటి గదుల కేటాయించడం లేదని టీటీడీ తెలిపింది.

అక్టోబర్‌ 14న గరుడసేవ సందర్భంగా అక్టోబర్‌ 12 నుండి 14 వరకు కాటేజీ దాతలకు టీటీడీ ఎలాంటి గదుల కేటాయించదు. ఒకే కాటేజీలో రెండు గదుల కంటే ఎక్కువగా విరాళంగా ఇచ్చిన దాతలకు రెండు గదులను రెండు రోజుల పాటు టీటీడీ కేటాయించనుంది. ఒకే కాటేజీలో ఒక గదిని విరాళంగా ఇచ్చిన దాతలకు ఒక గదిని రెండు రోజుల పాటు కేటాయిస్తుంది. ఈ విషయాన్ని గమనించాలని కాటేజీ దాతలకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.

బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం
ఆహ్వాన పత్రికను అందజేసిన టీటీడీ ఈవో
సాక్షి, అమరావతి: తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబును టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ శనివారం ఆహ్వానించారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎంని కలిసిన సింఘాల్‌ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ, తిరుమలకు సంబంధించిన పలు అంశాలను ఆయన చంద్రబాబుకు వివరించారు. 

మరిన్ని వార్తలు