టీటీడీ ఉద్యోగుల ఉద్యమానికి సైరన్‌

24 Jul, 2018 01:13 IST|Sakshi

ఆగస్టు 16 నుంచి దశలవారీ ఉద్యమం

తిరుపతి అర్బన్‌: తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ)లో పనిచేస్తున్న 9 వేల మంది శాశ్వత, 13 వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఉద్యమానికి సైరన్‌ మోగించారు. ఆగస్టు 16 నుంచి దశల వారీ ఉద్యమం, ఆ తర్వాత సమ్మెకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. సోమవారం రాత్రి తిరుపతిలోని పరిపాలనా భవనం ఆవరణలో సమావేశమైన అన్ని యూనియన్లు, జేసీఏ నేతల సమక్షంలో కార్యాచరణ ప్రకటించారు. జేసీఏ కన్వీనర్‌ గంపల వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై అధికారులు నియంతృత్వ ధోరణి వల్లే దశాబ్దాల తరబడి తమ సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు.

ధార్మిక సంస్థలో ఉద్యోగులకు కనీస హక్కులు కూడా కల్పించడంలేదన్నారు. సొంత ఇళ్లు, ఆరోగ్యానికి భరోసాగా మెరుగైన వైద్య సేవలు, స్వామివారి దర్శనాల్లో ప్రాధాన్యం లేకపోవడం దారుణమన్నారు. వీటన్నిటిపై సుమారు 30 ఏళ్ల నుంచి పోరాడుతున్నా అధికారులెవరూ పరిష్కరించలేదన్నారు. సమస్యల పరిష్కారానికి ఉద్యమ పంథాను ఎంచుకున్నట్లు చెప్పారు. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవాలని 2005లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించినట్లు తెలిపారు. ఈసారి దానికి మించి ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు