రసాభాసగా టీటీడీ పాలకమండలి సమావేశం

28 May, 2019 12:11 IST|Sakshi

సమావేశాన్ని బహిష్కరించిన ఈవో, జేఈవో

సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ) పాలకమండలి సమావేశం రసాభాసగా మారింది. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, జేఈవో శ్రీనివాసరాజులు బయటకు వచ్చారు. పాలకమండలి సభ్యత్వానికి చల్లా రామచంద్రారెడ్డి (బాబు) రాజీనామా చేయడంతో కార్యదర్శి హోదాలో టీటీడీ ఈవో సమావేశం నిర్వహించాల్సింది. కానీ టీటీడీ అధికారులు సమావేశాన్ని బహిష్కరించడంతో బోర్డు తీర్మానాల అమలు కోసం నిర్వహించిన సమావేశం అర్థాంతరంగా ముగిసింది. అంతకు ముందు బోర్డు సభ్యుడుగా ఇచ్చిన లెటర్ పై ఎందుకు దర్శనాలు ఇవ్వటంలేదని సభ్యుడు చల్లాబాబు అధికారులను నిలదీశారు. అధికారులు ససేమిరా అనటంతో.. ఆగ్రహం వ్యక్తం చేశారు చల్లా బాబు. తీరు మారకపోవటంతో.. చల్లా రామచంద్రారెడ్డి పాలమండలికి రాజీనామా చేసి వెళ్లిపోయారు.

నెల రోజుల క్రితమే పాలక మండలి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించామని.. అందులో భాగంగానే ఈ భేటీ జరిగినట్లు చైర్మన్‌ సుధాకర్‌ యాదవ్‌ మీడియాకు తెలిపారు. సమావేశంలో తాము వేచి చూసినా అధికారులు రాలేదన్నారు. తమని ప్రభుత్వం నియమిస్తేనే ప్రమాణ స్వీకారం చేశామని, వాళ్లు రద్దు చేస్తేనే పదవులు వదులుకుంటామన్నారు. స్వచ్చందంగా మాత్రం రాజీనామా చేయమన్నారు. ఇక టీటీడీ పాలక మండలి సభ్యత్వానికి చల్లా బాబుతో పాటు పార్థసారథి, రాయపాటి, బోండా ఉమలు కూడా రాజీనామా చేశారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అయితే రాష్ట్రంలో మరో రెండ్రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న సమయంలో హడావుడిగా టీటీడీ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సాధారణంగా ఎన్నికల్లో పాలక ప్రభుత్వం ఓడిపోతే దాని ద్వారా నియమితులైన పాలక మండళ్లు నైతికంగా రాజీనామా చేస్తాయి. కానీ, ఇక్కడ అందుకు విరుద్ధంగా టీటీడీ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించటానికి ప్రయత్నించారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు తిరుమలలో విస్తృత ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో ఇటీవల పెద్దఎత్తున బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ ఓ మాట.. బ్యాంకు అధికారులు మరోమాట చెప్పడంతో అనేకానేక అనుమానాలు తలెత్తాయి. వీటిని ఇటు టీటీడీ కానీ, అటు టీడీపీ సర్కారు కానీ నివృత్తి చేసిన దాఖలాల్లేవు. అదే విధంగా.. ప్రైవేటు బ్యాంకుల్లో నగదు, బంగారం డిపాజిట్ల వెనుక కొందరు పాలక మండలి సభ్యులతో పాటు ప్రభుత్వంలోని పలువురు పెద్దల పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ పది మంది తాత్కాలిక ఉద్యోగుల నియామకానికి కూడా పచ్చజెండా ఊపేందుకు కూడా ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు