వాటి కోసమే వంటశాల మూసేశారు : రమణ దీక్షితులు

18 May, 2018 18:46 IST|Sakshi

2017 డిసెంబర్‌ నుంచి 25 సార్లు వంటశాల మూసేశారు

పల్లవులు, చోళులు కాలంనాటి ఆభరణాలను వెతికే ప్రయత్నం జరిగింది

గులాబీ రంగు వజ్రం పగిలిపోవడం అబద్ధం

ఈవోకు తెలియకుండా ఇవన్నీ ఎలా జరుగుతాయి

టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు

సాక్షి, అమరావతి : తాను పుట్టినప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి సేవలో ఉన్నానని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తెలిపారు. తన తండ్రి తర్వాత వంశపారపర్యంగా తిరుమల ప్రధాన అర్చకుడిగా కొనసాగున్నానని చెప్పారు. స్వామివారికి  కైంకర్యాలు సరిగ్గా జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. వెయ్యి ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీవారి వంటశాలను మూసివేసిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. స్వామి వారికి ఎప్పుడు నైవేద్యం అందకుండా లేదని, ఏ సౌకర్యాలు లేని సమయంలోనే తమ వంశీకులు నిత్యం నైవేద్యం పెట్టేవారని తెలియచేశారు.

కానీ 2017 డిసెంబర్ 8 నుంచి ఇప్పటి వరకూ దాదాపు 25 రోజులు వంటశాల మూసివేశారని, ఇది ఆగమ శాస్త్ర విరుద్ధమని రమణ దీక్షితులు అన్నారు. శుచిగా రుచిగా లేని నైవేద్యంతో స్వామి వారిని పస్తు పెట్టామనే బాధగా ఉందని వాపోయారు. వంటశాల మూసివేసినప్పుడు చూస్తే అధ్వాన్నంగా ఉందని, పల్లవులు, చోళులు కాలంనాటి బంగారు ఆభరణాలను వెతకడం కోసం తవ్వినట్లు అనిపించిందన్నారు. ఈ విషయమై ఆలయ ఈవోను పలుసార్లు అడిగినా, ఏమీ తెలియదనే సమాధానం వచ్చిందని తెలిపారు. కానీ ఈవోకు తెలియకుండా ఇదంతా ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.

2001 గరుడ సేవ నాడు సమర్పించిన ప్లాటినం హారంలో గులాబీ రంగు వజ్రం ఉండేదని చెప్పారు. భక్తులు విసిరిన నాణేల కారణంగా అది పగిలిపోయిందని.. కనిపించలేదని రికార్డుల్లో రాశారని వెల్లడించారు. కానీ ఇటీవల జెనీవాలో అలాంటి గులాబీ రంగు వజ్రం 500 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన వార్త చదివానని వెల్లడించారు. భక్తులు విసిరిన నాణేలకు వజ్రం పగిలిందనేది అవాస్తవని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని, స్వామి సంపద పోయిందని, నైవేద్యం అందడం లేదని, ఎలాంటి వైపరీత్యం జరుగుతుందేమోనన్న భయంతో బయటికి చెప్పానని అన్నారు. కానీ తనపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక భవిష్యత్తు భగవంతుడే నిర్ణయించాలని ఆయన అన్నారు.

>
మరిన్ని వార్తలు