ఇది దురుద్దేశ చర్య: టీటీడీ

7 Jul, 2020 11:49 IST|Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)పై రోజురోజుకీ కుట్రలు పెరిగిపోతున్నాయి. అడుగడుగునా అన్యమత ముద్ర వేసేందుకు కొన్ని వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గతంలో అనేక సార్లు తిరుమల శ్రీవారు, ఆలయంపై అవాస్తవ సమాచారాన్ని సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. వాటిని ఖండించిన టీటీడీ అసత్య కథనాలపై ఫిర్యాదు చేసింది. ఇక తాజాగా మరోసారి తమకు సంబంధం లేకున్నా టీటీడీ మరోసారి వార్తల్లో నిలిచింది. గుంటూరుకు చెందిన ఒక పాఠకుడికి టీటీడీ మాస పత్రిక సప్తగిరితో పాటు అన్యమతానికి చెందిన మరో పుస్తకం రావడం కలకలం రేపింది. దీంతో వెంటనే అప్రమత్తమైన టీటీడీ.. ఇది దురుద్దేశ చర్య అంటూ తీవ్రంగా ఖండించింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టారు.

కాగా సప్తగిరి మాస ప‌త్రిక ప్యాకింగ్, డెలివ‌రీ భాధ్య‌త మొత్తం పోస్ట‌ల్ శాఖ‌వారే చూస్తారన్న విషయం తెలిసిందే. పోస్ట‌ల్ శాఖ‌కు పోస్టేజి చార్జీల‌తో పాటు ఒక్కో ప్ర‌తికి అద‌నంగా రూ. 1.05 టీటీడీ అద‌నంగా చెల్లిస్తోంది. ఇక గతంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యత్వానికి సుధా నారాయణమూర్తి రాజీనామా చేశారని ఫేస్‌బుక్‌లో అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా.. తిరుమలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, భక్తులు తిరుమలకు వెళ్లకూడదని తమిళ నటుడు శివకుమార్‌ ప్రచారం చేశారని తమిళ్‌మయ్యన్‌ అనే వ్యక్తి ఈ–మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేయగా అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు