టీడీపీ కనుసన్నల్లో టీటీడీ ఫైనాన్స్‌!

27 Apr, 2019 04:27 IST|Sakshi

టీటీడీ ఆర్థిక విభాగంలో అధికార పార్టీ నేతలదే పెత్తనం

నిబంధనలకు విరుద్ధంగా టీటీడీ ఉద్యోగి ఎఫ్‌ఏ అండ్‌ సీఏవోగా నియామకం

తెలుగుదేశం నేతల స్వప్రయోజనాల కోసం దారిమళ్లిన టీటీడీ నిధులు   

ఐదేళ్లుగా పూర్తిగా బలహీనపడ్డ టీటీడీ ఆర్థిక విభాగం

సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో కీలకమైన ఆర్థిక విభాగం వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల వినియోగం, డిపాజిట్లపై కీలకమైన నిర్ణయాలు తీసుకునే టీటీడీ ఆర్థిక విభాగం కొందరు ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో నడుస్తోంది. వారు ఏది చెబితే దానికి తలూపుతూ ఇష్టారాజ్యంగా నిధులను విడుదల చేస్తూ టీటీడీని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో ఎన్నికల అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ బంగారం వ్యవహారంలో టీటీడీ ఆర్థిక విభాగం పనితీరు మరోసారి తెరపైకి వచ్చింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసిన బంగారాన్ని తిరిగి తీసుకునే విషయంలో టీటీడీ ఆర్థిక విభాగం వ్యవహరించిన తీరు అనుమానాలకు తావిచ్చింది. అంతేకాకుండా ఇతర ఆర్థిక లావాదేవీల్లోనూ ఆర్థిక విభాగం పనితీరు దారుణంగా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

టీటీడీ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత కనిపించడం లేదని భక్తులు తప్పుపడుతున్నారు. టీటీడీ ఆర్థిక విభాగాన్ని కొందరు ప్రభుత్వ పెద్దలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం బలహీనపరిచారు. అందుకే ఐదేళ్ల కాలంలో ఆర్థిక విభాగాన్ని వివాదాలు చుట్టుముట్టాయి. టీటీడీకి ఉన్న ప్రాధాన్యం రీత్యా ఈవో, జేఈతో పాటు ఆర్థిక సలహాదారు, ముఖ్య గణాంకాధికారిని ప్రభుత్వం నుంచి డిప్యుటేషన్‌పై తీసుకోవాలి. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ విధానానికి ప్రభుత్వ పెద్దల సహకారంతో టీటీడీలోని కొందరు అధికారులు, పాలకమండలి సభ్యులు మంగళం పాడారు.
 
టీటీడీలో లెక్కలేనన్ని అక్రమాలు  
గత ఐదేళ్లుగా టీటీడీలో అధికార తెలుగుదేశం పార్టీ నేతలకు అడ్డే లేకుండా పోయింది. స్వామివారి నిధులను ఆ పార్టీ పెద్దలు ఇష్టానుసారంగా దారి మళ్లించుకున్నారు. టీటీడీకి చెందిన రూ.1,000 కోట్ల విలువైన భూమిని టాటా ఆసుపత్రికి కేటాయించారు. టీడీపీ నేతల స్వప్రయోజనాల కోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ పనులకు టీటీడీ నిధుల నుంచి రూ.40 కోట్లు మంజూరు చేయించుకుని ఖర్చుచేశారు. రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ.150 కోట్లు టీటీడీ కేటాయించింది. రాజధానిలో ప్రైవేటు సంస్థలకు వందలాది ఎకరాలను ధారాదత్తం చేస్తున్న ప్రభుత్వం టీటీడీకి మాత్రం భూమిని ఉచితంగా ఇవ్వలేదు. దీంతో టీటీడీ అమరావతిలో రూ.12.50 కోట్లు వెచ్చించి భూమిని కొనుగోలు చేసింది. తిరుమలలో లడ్డు పోటును విస్తరించే క్రమంలో ఉగ్రాణం వద్ద ఉన్న గోడను తొలగించి పెద్ద గోడ నిర్మించాలని టీటీడీ భావించినట్లు సమాచారం.

పాత గోడను తొలగించేందుకు టీటీడీ రూ.2 కోట్లతో టెండర్‌ పిలిచి నిధులు దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక గోడను తొలగించడానికి రూ.2 కోట్లు అవసరమా? అని టీటీడీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి ఆలయంలో వెండివాకిలి వద్ద మెట్లను ఏర్పాటు చేశారు. ఆగమ శాస్త్రానికి విరుద్దంగా వాటిని ఏర్పాటు చేశారని విమర్శలు రావడంతో వెంటనే తొలగించారు. ఆ మెట్లు ఏర్పాటు చేయటానికి రూ.33 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిసింది. దీనిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమలలో రెస్టారెంట్ల నిర్వహణను తెలుగుదేశం పార్టీ నేతలు బినామీ పేర్లతో అతి తక్కువ ధరకే దక్కించుకున్నారు. ఫలితంగా టీటీడీ భారీగా ఆదాయం కోల్పోయింది. టీటీడీలో విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారి ముఖ్య గణాంకాధికారిగా ఉంటే టీటీడీ నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండేది కాదని అంటున్నారు.

టీటీడీ ఉద్యోగే ముఖ్య గణాంకాధికారి
టీటీడీలో పనిచేసే ఉద్యోగినే ముఖ్య గణాంకాధికారి(ఎఫ్‌ఏ అండ్‌ సీఏవో)గా నియమించడానికి వీలుగా నిబంధనలను మార్చేశారు. టీటీడీలో అడిషనల్‌ ఎఫ్‌ఏగా ఉన్న బాలాజీ అనే వ్యక్తిని ముఖ్య గణాంకాధికారిగా నియమించడానికి కొందరు పెద్దలు పావులు కదిపారు. నిబంధనల ప్రకారం టీటీడీలో ముఖ్య గణాకాంధికారిని నియమించాలంటే ఇండియన్‌ ఆడిట్‌ అకౌంట్‌ సర్వీసులో కనీసం ఐదేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రెటరీ, ఆపై పోస్టులో కనీసం ఐదేళ్లు పనిచేసైనా ఉండాలి. లేదంటే చార్టెర్డ్‌ అకౌంటెంట్‌గా పదేళ్ల అనుభవం ఉన్న వారిని నియమించాలి. ఇవేమీ లేకున్నా బాలాజీని టీటీడీ ముఖ్య గణాంకాధికారిగా నియమించడం గమనార్హం. టీటీడీ ఆర్థిక వ్యవహారాల్లో పాలకమండలి సభ్యులు, అధికారులు పెత్తనం చెలాయించడానికే నిబంధనలకు విరుద్ధంగా బాలాజీని ముఖ్య గణాంకాధికారిగా నియమించుకున్నట్లు తెలుస్తోంది.   

మరిన్ని వార్తలు