కరోనా నియంత్రణకు టీటీడీ సహకారం

29 Mar, 2020 09:41 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌  

బర్డ్‌ ఆస్పత్రిలోనూ వైద్య సదుపాయం 

స్విమ్స్‌లో వెంటిలేటర్ల  కొనుగోలుకు సాయం 

టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ 

సాక్షి, తిరుమల: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు టీటీడీ తరఫున అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. తిరుమల లోని ధర్మగిరి వేదవిజ్ఞానపీఠంలో మూడు రోజుల పాటు జరిగిన  శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం శనివారం మహాపూర్ణాహుతితో ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ ఈఓ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ కారణంగా కొంత మంది తిరుపతిలో ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. టీటీడీ బోర్డు చైర్మన్‌  వైవి.సుబ్బారెడ్డి సూచనల మేరకు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ద్వారా ఈనెల 28 నుంచి తిరుపతిలో ఆహార పొట్లాల పంపిణీని ప్రారంభించినట్లు తెలిపారు. అవసరమైతే ఒక పూటకు 50 వేల ఆహార పొట్లాలు తయారుచేసి పంపిణీ చేసేందుకు టీటీడీ సిద్ధంగా ఉందని వివరించారు. 
బర్డ్‌ ఆస్పత్రిలో కరోనాకు వైద్యం 
రాయలసీమ జిల్లాల నుంచి కరోనా అనుమానిత కేసులు ఎక్కువగా తిరుపతిలోని స్విమ్స్‌కు వస్తున్నాయని, అవసరమైతే బర్డ్‌ ఆస్పత్రిని కూడా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు, క్వారంటై¯Œన్‌గా వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చామని ఈఓ వెల్లడించారు. ఇందుకోసం టీటీడీ అధికారులు తగిన ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఇప్పటికే తిరుపతిలోని రుయా ఆస్పత్రితోపాటు స్విమ్స్, పద్మావతి వైద్య కళాశాలలో కరోనా వ్యాధి అనుమానితుల కోసం తగిన ఏర్పాట్లు చేశారని, తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయం వసతి సముదాయాన్ని క్వారంటైన్‌ కేంద్రంగా వినియోగిస్తున్నారని తెలియజేశారు. స్విమ్స్‌కు అవసరమైన వెంటిలేటర్లను కొనుగోలు చేసేందుకు సాయం చేస్తామని ఈఓ తెలిపారు.

మరిన్ని వార్తలు