మళ్లీ తెరపైకి లడ్డూ ధరల పెంపు అంశం

27 Mar, 2017 01:46 IST|Sakshi
మళ్లీ తెరపైకి లడ్డూ ధరల పెంపు అంశం

నేడు టీటీడీ ధర్మకర్తల మండలిలో చర్చ

సాక్షి, తిరుమల: తిరుమలేశుని ఆర్జిత సేవలు, వీఐపీ టికెట్లు, లడ్డూ ధరల పెంపు, కాటేజీల అద్దెలు పెంపు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. సోమవారం(నేడు) జరగనున్న ధర్మకర్తల మండలి సమావేశంలో ఇదే అంశాన్ని ప్రధానంగా చర్చించనున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌ అతిథి గృహంలో టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు.

రేపు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీవారి దర్శనం నిలిపివేశారు. ఉదయం నిర్వహించాల్సిన అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దు కూడా చేశారు. అలాగే 29వ తేదీ ఉగాది పర్వదినం సందర్భంగా సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం రద్దు చేశారు. తెల్లవారుజామున జరిగే తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు