మొబైల్‌ ఫోన్‌ నుంచే టీటీడీ సదుపాయాలు

29 Mar, 2017 20:43 IST|Sakshi
మొబైల్‌ ఫోన్‌ నుంచే టీటీడీ సదుపాయాలు

తిరుమల: మొబైల్‌ ఫోన్‌ నుంచే తిరుమల శ్రీవారి రూ.300 దర్శన టికెట్లు, గదుల బుకింగ్, ఈ-హుండీ, ఈ-డొనేషన్‌ సౌకర్యాలు పొందేలా టీటీడీ మొబైల్‌ యాప్‌ రూపొందించింది. ఉగాది సందర్భంగా తిరుమల ఆలయం వద్ద బుధవారం ‘గోవింద తిరుమల తిరుపతి దేవస్థానమ్స్‌’ పేరుతో కొత్త యాప్‌ను టీటీడీ ఈవో డాక్టర్‌ సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌తో ఇప్పటివరకు 1.30 కోట్ల మంది శ్రీవారి దర్శనం చేసుకున్నట్లు వివరించారు.

ఐటీ సంస్థ టీసీఎస్‌ సహకారంతో మొబైల్‌ యాప్‌ రూపొందించినట్లు వెల్లడించారు. దీంతో ఇకపై భక్తులు శరవేగంగా, సులభంగా ఎక్కడి నుంచైనా యాప్‌ సేవలు పొందవచ్చన్నారు. ప్రస్తుతానికి ఈ-హుండీ, ఈ-డొనేషన్, రూ.300 దర్శన టికెట్ల బుకింగ్, గదుల బుకింగ్‌ సదుపాయాలు ఉన్నాయని, మలిదశలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. గూగుల్‌ స్టోర్, టీటీడీ వెబ్‌సైట్‌ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. టీటీడీ వెబ్‌సైట్‌కున్న 33 లక్షల మంది యూజర్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు.

టీటీడీ ఆన్‌లైన్‌ సేవలు భేష్‌: సుధా నారాయణమూర్తి
టీటీడీ బోర్డు సభ్యురాలుగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సుధా నారాయణమూర్తి టీటీడీ ఐటీ సేవల్ని అభినందించారు. ఈ యాప్‌ ద్వారా టీటీడీ శ్రీవారి భక్తులకు మరింత చేరువైందన్నారు. భక్తులు కూడా సులభతరంగా శ్రీవారి సేవలు పొందవచ్చన్నారు. టీటీడీ యాప్‌ను  ‘https://play.google.com/store/apps/details?id=com.ttdapp’  ఈ లింక్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు