భక్తులకు సౌకర్యాలా.. 108 ఇంచుల టీవీలా?

30 May, 2014 15:16 IST|Sakshi
భక్తులకు సౌకర్యాలా.. 108 ఇంచుల టీవీలా?

వరుసగా రెండు రోజులు సెలవలు వస్తే చాలు.. తిరుమల కిటకిట. క్యూలైన్లలో కనీసం నిల్చోడానికి కూడా సరిపడ స్థలం ఉండదు. పోనీ, భక్తుల రద్దీని నియంత్రించలేకపోయినా మధ్యమధ్యలో కనీసం మజ్జిగ నీళ్లయినా ఇస్తే భక్తులకు కాస్త నిలబడే ఓపిక అయినా వస్తుంది. రూ. 300 టికెట్ పెట్టి ప్రత్యేక ప్రవేశ దర్శనం అంటారే గానీ, దానికి కూడా కనీసం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు పడుతున్న పరిస్థితి. తిరుమలలో భక్తులకు ఇన్ని ఇబ్బందులున్నా, టీటీడీ పాలకమండలి సభ్యులకు మాత్రం అవేవీ కనిపించలేదు. (చదవండి: వైకుంఠం క్యూకాంప్లెక్సులలో 108 అంగుళాల టీవీలు)

వైకుంఠం క్యూ కాంప్లెక్సు 1లో ఉన్న 32 కంపార్టుమెంట్లలో ఒక్కోదాంట్లో 108 అంగుళాల టీవీలు పెట్టాలని మాత్రం తోచింది. ఇందుకు ఏకంగా రెండున్నర కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఈ కంపార్టుమెంట్లలోకి రావడానికి ముందు, ఆ తర్వాత కూడా బోలెడంత దూరం భక్తులు నిలువు కాళ్ల మీద నిల్చోవాల్సి ఉంటుంది. చాలాచోట్ల కనీసం గాలి కూడా ఆడదు. అలాంటిచోట్ల ఫ్యాన్లు ఏర్పాటుచేయాలన్న ఆలోచన కూడా పాలకమండలికి గానీ, అధికారులకు గానీ రాలేదు. గతంలో కంపార్టుమెంట్లలో వేచి ఉండే భక్తులకు మధ్యమధ్యలో మజ్జిగ, ఏదో ఒక ఆహారం ప్యాకెట్లు ఇచ్చేవారు. కానీ గత కొంత కాలంగా అదికూడా లేదు. కేవలం మొట్టమొదట ఉండే క్యూలో మాత్రమే మంచినీళ్లు, అప్పుడప్పుడు ఉప్మా లాంటివి ఇస్తున్నారు.

వేసవి సెలవలు అయిపోతుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోడానికి వెళ్తున్నారు. అలా వెళ్లేవారికి ప్రధాన ఆలయానికి వెళ్లేలోపే ఆ భగవంతుడు కళ్లెదుటే కనిపిస్తున్నాడు. ఒకటి రెండు చోట్ల తప్ప ఎక్కడా గాలి ఆడే పరిస్థితి కూడా ఉండదు. ఎక్కువ సేపు వేచి ఉంటే కూర్చోడానికి సదుపాయం ఉండదు. అలాగే, అసలు క్యూలైన్లలోకి ప్రవేశించడానికి ముందు దర్శనానికి ఎంత సమయం పట్టొచ్చన్న సమాచారం కూడా భక్తులకు అందదు. ఒకసారి క్యూలైన్లోకి వెళ్లిన తర్వాత మధ్యలో బయటకు రావడానికి వీలుండదు. మధుమేహం, రక్తపోటు లాంటి సమస్యలు ఉన్న భక్తుల పరిస్థితి వర్ణనాతీతం.

క్యూలైన్లలోకి కొంతమంది అనధికారికంగా వచ్చి పది రూపాయల ఫ్రూటీ ప్యాకెట్ను ఇరవై రూపాయలకు, నాలుగు సన్నపాటి మామిడి బద్దలను పదిరూపాయలకు అమ్ముతుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో భక్తులు వాటినే కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఈ అంశాలన్నీ పాలకమండలి సభ్యులకు, అధికారులకు తెలియనివేమీ కావు. చాలాసార్లు వాళ్ల దృష్టికి వెళ్లినా, తమ చేతిలో ఉండి.. పరిష్కరించగలిగే సమస్యలపై కూడా ఇంతవరకు పాలకమండలి దృష్టిపెట్టలేదు. మరికొన్నాళ్లలోనే టీటీడీ పాలకమండలి పదవీకాలం అయిపోతుండటంతో ఇప్పుడు హడావుడిగా పెద్దపెద్ద టీవీల కొనుగోళ్లకు ఆమోదం తెలిపిందన్న విమర్శలు సైతం వస్తున్నాయి. ఇప్పటికైనా పాలకమండలి సభ్యులు, అధికారులు ముందుగా భక్తుల సౌకర్యాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు