ప్రైవేటు భక్తి!

26 Apr, 2019 10:58 IST|Sakshi

రూ.75కోట్లతో నిర్మించిన పద్మావతీ నిలయం

ప్రయివేటు నిర్వహణపై టీటీడీ దృష్టి

ఇదేనా సామాన్య భక్తుల సేవ

టీటీడీ వ్యవహారంపై భక్తులు, ఆధ్మాత్మికవేత్తల మండిపాటు

ఉద్యమం తప్పదంటున్న స్థానికులు

తిరుమల శ్రీవారితో పాటు తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సామాన్య భక్తులు సాధారణంగా టీటీడీ వసతి సముదాయాల్లో  బస చేసేందుకు మొగ్గు చూపుతారు. రద్దీ పెరిగిపోవడంతో వసతి దొరక్క ఇప్పటికే సామాన్య భక్తులు అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో టీటీడీ తాజా నిర్ణయం పలు విమర్శలకు తావిస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన పద్మావతి నిలయాన్నిప్రైవేటు నిర్వహణకు అప్పగించాలనుకోవడంపై భక్తులు మండిపడుతున్నారు. ‘సామాన్య భక్తుల సేవే పరమావధి’ అంటూ ఉపన్యాసాలు ఇస్తున్న టీటీడీ వ్యాపార ధోరణితోవ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

చిత్తూరు, తిరుమల:  వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన టీటీడీ తాజాగా తీసుకున్న నిర్ణయం భక్తుల ఆగ్రహానికి గురవుతోంది. రూ.కోట్లతో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన వసతి సముదాయాన్ని ప్రైవేటు నిర్వహణకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది.  ఆదాయమే పరమావధిగా టీటీడీ వ్యవహరిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య భక్తుల వసతి కోసం తిరుచానూరు సమీపంలో సుమారు రూ.75 కోట్లతో శ్రీపద్మావతి అతిథి గృహాన్ని టీటీడీ నిర్మించింది. ఐదు అంతస్థులతో పాటు నాలుగు డార్మిటరీ హాళ్లు, 200 గదులతో ఈ భవనాన్ని ఏర్పాటుచేసింది.  భవనాన్ని ప్రారంభించేందుకు టీటీడీ సన్నాహాలు కూడా చేసింది. ఎన్నికల కోడ్‌ రావడంతో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా పెండింగ్‌లో ఉంచింది. అంతకు ముందే గదులకు అద్దెను సైతం టీటీడీ పాలకమండలి నిర్ణయించింది.

అనూహ్యంగా ప్రైవేటీకరణ మొగ్గు
ప్రపంచంలో టీటీడీ అతి పెద్ద ఆధ్యాత్మిక సంస్థగా పేరుగాంచింది.  భక్తుల సేవే భగవంతుని సేవగా భావించి సామాన్య భక్తుల సౌకర్యాల కోసం కోట్లాది రూపాయలు వెచ్చి స్తోంది. తాజాగా వ్యాపార దృక్పథంతో వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.  ఇప్పటికే విష్ణు నివాసం, శ్రీనివాసం లాంటి అతిపెద్ద వసతి సముదాయాలను టీటీడీనే నిర్వహణ బాధ్యతలను చూస్తోంది.  పద్మావతి నిలయాన్ని మాత్రం ప్రైవేటీకరణ చేయడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. మొదటి నుంచి పద్మావతి భవనం ద్వారా భక్తులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని టీటీడీ అధికారులు చెప్పుకొచ్చారు. అనూహ్యంగా అధికారులు ఇలా  ప్రైవేటు  నిర్వహణ వైపు మొగ్గుచూపడంపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. అధికార పార్టీ నాయకులకు లబ్ధి చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి.

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా..
పద్మావతి నిలయాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఏడాదికి  రూ.3.84కోట్ల ఆదాయం వస్తుందని టీటీడీ అంచనా వేస్తోంది.  వీటి నిర్వహణ కోసం టెండర్లను కూడా పిలిచింది. భక్తుల కానుకల ద్వారా కోటానుకోట్ల ఆదాయం పొందుతున్న టీటీడీ,  సౌకర్యాల కల్పనలో వ్యాపార దృక్పథంలో యోచించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఈ నిర్ణయంతో భవనం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారడంతో పాటు సామాన్య భక్తులకు తగిన ప్రాధాన్యం లభించదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శాంతి భద్రతలకు విఘాతం
పద్మావతి నిలయాన్ని ప్రైవేట్‌ వ్యక్తుల చేతి లో పెడితే టీటీడీ పరుపుపోవడం ఖాయమని ఆధ్యాత్మిక సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలను వెచ్చించి టెండరు దక్కించుకునే వ్యక్తి తన ఆదాయాన్ని పెంచుకోవడానికే ప్రాధాన్యం ఇస్తాడని వారు చెబుతున్నారు. ఒక్కసారి టీటీడీ నుంచి భవనం ప్రైవేట్‌ వ్యక్తుల చేతిలోకి వెళ్తే, టీటీడీ కీర్తిప్రతిష్టలు వారి చేతిలోకి వెళ్లినట్టేనంటున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారే ప్రమాదమూ లేకపోలేదని వారు హెచ్చరిస్తున్నారు. భక్తుల కోసం నిర్మించిన భవనాన్ని టీటీడీ నిర్వహించాలే తప్ప, ఇలా ఆదాయం కోసం ప్రైవేటు నిర్వహణకు అప్పగిస్తే ఉద్యమిస్తామని వారు స్పష్టంచేస్తున్నారు.

మరిన్ని వార్తలు