టీటీడీ పాలకమండలిలో సామాజిక వాదులకూ చోటివ్వాలి

21 Nov, 2018 07:00 IST|Sakshi
జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన ఆధ్యాత్మిక ప్రవచనకర్త జ్యోతిర్మయి

ఆధ్యాత్మిక ప్రవచనకర్త కొండవీటి జ్యోతిర్మయి

ప్రజా సంకల్పయాత్ర బృందం: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గంలో రాజకీయ, సీని ప్రముఖులకు ప్రాధాన్యం తగ్గించి ఉత్తమ సామాజిక వాదులకు, మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులకు స్థానం కల్పించాలని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, హిందూ ధర్మ ప్రచారకుడు కొండవీటి జ్యోతిర్మయి అన్నారు. మంగళవారం విజయనగరం జిల్లాలోని కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలంలో గల సీమనాయుడుపేటలో జరుగుతున్న ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఆమె ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ దేశంలో మంచి వ్యక్తిత్వం కలిగిన వారు చాలా మంది ఉన్నారని, అటువంటి వారికి స్థానం కల్పిస్తే  హిందూజాతి మొత్తం వైఎస్సార్‌సీపీ వెంట ఉంటుందన్నారు.

ప్రస్తుతం అస్తవ్యçస్తమైన సంఘటనలు చూస్తున్న నేపథ్యంలో రాజకీయ, సినీ ప్రముఖులకు ప్రాధాన్యం తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు పూర్తిగా ఉండకూడదన్నది తమ అభిమతం కాదని, పది మందిలో ఒక రాజకీయ వేత్త ఉంటే సరిపోతుందన్నారు. పాలక మండలికి ధార్మిక సేవాసమితిగా నామకరణం చేయాలన్నారు. టీటీడీ దేవస్థానంలో 25 కిలోమీటర్ల దూరం వరకు మద్యం అమ్మకాలు నిషేధాన్ని పక్కాగా అమలు చేయటం ఆ ప్రాంతంలో పవిత్రతను కాపాడే నిర్ణయాన్ని వైఎస్సార్‌సీపీ అజెండాలో పెట్టాలని కోరినట్లు తెలిపారు. ఆలయ పరిషత్‌ పరిరక్షణ ద్వారానే పునరుద్ధరణ కార్యక్రమం పూర్తవుతుందన్నారు. దేశంలో కేంద్రబిందువుగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో మంచి సంస్కరణలు, చక్కనైన ఉద్ధరణ జరిగినపుడే మొత్తం దేశంలోని అన్ని ఆలయాలు అదే మార్గంలో ముందుకు వెళతాయని పేర్కొన్నారు. అందుకనే టీటీడీ దేవస్థానంలో సంస్కరణలు తీసుకువచ్చే విధంగా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చర్యలు చేపట్టాలని కోరానన్నారు.

గిరిజన నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
జగన్‌ను కోరిన గిరిజన ఐక్య వేదిక ప్రతినిధులు

ప్రజాసంకల్పయాత్ర బందం: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన నిరుద్యోగులు, యువతీ, యువకులు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ గిరిజన ఐక్యవేదిక అధ్యక్షుడు ఒ.రామ్మూర్తి ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కురుపాం నియోజకవర్గంలోని జియ్యమ్మవలస మండలం పూతికవలస వద్ద మంగళవారం జగన్‌ను గిరిజన ఐక్యవేదిక ప్రతినిధులు కలిశారు. రాష్ట్రంలో గిరిజన యువతీ, యువకులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పని చేస్తున్న వారికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రెగ్యులర్‌ చేయాలన్నారు.

రాష్ట్రంలో వివిధ శాఖల్లో పని చేస్తున్న ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులను ఎంప్లాయ్‌మెంట్‌ ఆధారంగా భర్తీ చేయాలని, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పని చేస్తున్న అవుట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్నారు. దూరవిద్య ద్వారా చదువుతున్న గిరిజన విద్యార్థులకు ట్యూషన్‌ ఫీజు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న 1348 గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్‌ గ్రామాలుగా గుర్తించాలని కోరారు. జననేతను కలిసిన వారిలో రాష్ట్ర కార్యదర్శి కూరాడ తిరుమల బాబ్జీ, ఉపాధ్యక్షుడు తేజే శ్వరరావు, ఆదివాసీ సంరక్షణ సేవా సమితి గౌరవ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ దొర తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు