టీటీడీ అధికారుల అత్యుత్సాహం

10 Jun, 2019 12:38 IST|Sakshi

సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల పర్యటన సందర్భంగా పన్నెండు పురాతన, అరుదైన నాణేలతో మెమెంటో తయారు చేయించిన టీటీడీ అధికారులు దానిని ఆయనకు బహుకరించేందుకు సిద్ధమయ్యారు. స్వామి వారికి చక్రవర్తులు బహుకరించిన బంగారు నాణేలతో బహుమతి ఇవ్వబోతున్నారన్న వార్త బయటకు పొక్కడంతో అధికారులు వెనక్కు తగ్గారు. ఎస్వీ మ్యూజియంలో ఉన్న 7, 15, 16, 18వ శతాబ్ధానికి చెందిన ఈ బంగారు నాణేలను అప్పట్లో చక్రవర్తులు శ్రీవారికి బహుకరించారు.

టీటీడీ అధికారులు ప్రధాని మోదీ మెప్పు పొందడానికి ఆ నాణేలను శ్రీవారి చిత్రపటానికి అమర్చి బహుకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం బయటకు పొక్కి పెద్ద సంఖ్యలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అధికారులు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. టీటీడీ అధికారుల వ్యవహారంపై శ్రీవారి భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అధికారుల నిర్వాకంపై రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతికి, పురావస్తు శాఖ అధికారులకు నవీన్ కుమార్ రెడ్డి  లేఖ రాశారు.

మరిన్ని వార్తలు