క్షణాల్లో వందల టికెట్లు అమ్ముడైపోయాయి

20 Aug, 2014 12:44 IST|Sakshi
క్షణాల్లో వందల టికెట్లు అమ్ముడైపోయాయి

తిరుపతి : ఇంటర్నెట్‌, ఈ-దర్శనం కౌంటర్ల కోసం మూడు వందల రూపాయల టికెట్లను టీటీడీ ఈవో గోపాల్‌ బుధవారం విడుదల చేశారు. ఐదు వేల టికెట్లు విడుదల కాగా.. క్షణాల్లో వందల టికెట్లు అమ్ముడైపోయాయి. మరోవైపు విజయవాడలో ఈ టికెట్ల కోసం భారీ క్యూ కనిపించింది. ప్రయోగాత్మకంగా తొలివిడత 5 వేల టికెట్లు ఇచ్చారు. అందులో 2500 టికెట్లను ఆన్‌లైన్ ఇంటర్నెట్ ద్వారా కేటాయించారు.

మిగిలిన వాటిని టీటీడీ ఈ-దర్శన్ కేంద్రాల నుంచి కేటాయింపు జరిగింది. టీటీడీ ఈ-దర్శన్ టికెట్లను హైదరాబాద్ కౌంటర్‌లో 850, విశాఖపట్నం 675, విజయవాడ 350, కర్నూలు 100, తిరుపతి 200, నెల్లూరు 100, నిజామాబాద్ 75, వరంగల్ 75, అనంతపురం కౌంటర్‌లో 75 కేటాయించారు. టికెట్లు పొందిన భక్తులను ఈ నెల 27న మధ్యాహ్నం 2 గంటలు, 3 గంటల సమయం స్లాట్లలో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.
 
ఇక ఇంటర్నెట్ ద్వారా టికెట్లు పొందే భక్తులు వారి ఫొటో గుర్తింపు కార్డును అప్‌లోడ్ చేసి, పేమెంట్ గేట్ వే ద్వారా క్రెడిట్, లేదా మాస్టర్ వీసా కార్డులద్వారా నగదు చెల్లింపులు చేయాలి. ఈ దర్శన కౌంటర్లలో భక్తులే నేరుగా వెళ్లి నగదు చెల్లించి ఫొటోమెట్రిక్ పద్ధతిలో వేలి ముద్ర, ఫొటో తీసుకుని టికెట్టు పొందవచ్చు.

మరిన్ని వార్తలు