వెంకన్న ఖాతాలో భారీగా విదేశీ కరెన్సీ

2 Feb, 2018 14:20 IST|Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్లను టీటీడీ శుక్రవారం విడుదల చేసింది. మే నెలకు సంబంధించి 61,858 సేవా టికెట్లను భక్తుల కోసం అందుబాటులోకి తెచ్చినట్టు టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.

టికెట్లను విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'టీటీడీ వద్ద 45 టన్నుల విదేశీ నాణేలున్నాయి. నాణేల మార్పిడికి టీటీడీ సంవత్సరాల తరబడి ప్రయత్నిస్తోంది. ఇందులో మలేసియా దేశ నాణేలు 18 టన్నులు ఉండగా.. వాటి మార్పిడికి బ్యాంక్‌ ముందుకొచ్చింది. త్వరలో 18 టన్నుల మలేషియా నాణేలు స్వదేశీ కరెన్సీగా మారుస్తాం. గత నెలలో రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించాం. అదే విధంగా ఈనెలలో శ్రీనివాసమంగాపురం, కపిలేశ్వర బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెల 13, 20 తేదీల్లో వికలాంగులు, వయో వృద్దులకు..14, 21వ తేదీల్లో చంటిబిడ్డ తల్లిదండ్రులకు ప్రత్యేకంగా దర్శనం కల్పిస్తున్నాం. గదుల పొందిన భక్తులకు ఇబ్బందులు తలెత్తితే టీటీడీ టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరిస్తాము.

క్యూ కాంప్లెక్స్ లో తోపులాటల నివారణకు మార్పులు తీసుకొచ్చాము. ఆన్‌లైన్‌లో లక్కీ డ్రిప్‌లో సేవా టికెట్లు పొందేందుకు లక్షమంది భక్తులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. భక్తుల కోసం నడక మార్గంలో, ఘాట్‌ రోడ్డులో అనేక ఏర్పాట్లు చేస్తున్నాము. మూడు నెలల్లో ప్రత్యేక పూల మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తున్నాము. జనవరి నెలలో 20.96 లక్షల మంది భక్తులు శ్రీవారి సేవలో పాల్గొనగా.. 87.49 లక్షల లడ్డూ విక్రయాలు జరిగాయి. హుండి ద్వారా స్వామి వారికి రూ.83.84 కోట్లు ఆదాయం లభించింది. టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్థులపై త్వరలో చర్యలు తీసుకుంటాం. ఆనందనిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్టు కోసం సమర్పించిన బంగారాన్ని కొంతమంది దాతలు వెనక్కి తీసుకుంటున్నార'ని అనిల్‌ కుమార్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు