ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసిన టీటీడీ

6 Sep, 2019 14:04 IST|Sakshi

సాక్షి, తిరుమల: భక్తులు కానుకగా సమర్పించిన రూ.47.5 కోట్ల పాత కరెన్సీ మార్పిడికి చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింగల్‌ తెలిపారు. అన్నమయ్య భవన్‌లో డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈవో అనిల్‌ కుమార్‌ భక్తుల సందేహాలకు సమాధానమిచ్చారు. అనంతరం మాట్లాడుతూ తిరుమలలో నీటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత ఏడాది గరుడ సేవ రోజు తలెత్తిన సమస్యపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు. ఈ సారి బ్రహ్మోత్సవాల్లో విజిలెన్స్‌, పోలీసుల మధ్య సమన్వయ లోపం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొన్ని కీలక నిర్ణయాలు టీటీడీ బోర్డు సమక్షంలో తీసుకుంటామన్నారు. ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు హుండీ ద్వారా రూ. 479.29 కోట్ల ఆదాయం సమకూరగా, 524 కిలోల బంగారాన్ని భక్తులు కానుకగా సమర్పించారన్నారు. నగదు రూపంలోనే కాకుండా చెక్కులు, డీడీలు, ఫారెన్‌ కరెన్సీ మార్పిడిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. పాత నోట్ల మార్పిడి కోసం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవా టికెట్లను టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. డిసెంబర్‌ నెలకు సంబంధించి మొత్తం 68,466 టికెట్లను విడుదల చేయగా ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానం కింద 6,516 సేవాటికెట్లను అందుబాటులో ఉంచింది. ఇందులో సుప్రభాతం 3856, తోమాల 60, అర్చన 60, అష్టాదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం కోసం 2,300 టికెట్లను విడుదల చేసింది. కరెంట్‌ బుకింగ్‌ కింద మరో 61,950 ఆర్జిత సేవా టికెట్లు విడుదలయ్యాయి. విశేష పూజ 2,500, కల్యాణోత్సవం 13,775, ఊంజల్‌ సేవ 4,350, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,975, వసంతోత్సవం 15,950, సహస్ర దీపాలంకరణ కోసం 17,400 టికెట్లను టిటిడి విడుదల చేసింది.

మరిన్ని వార్తలు