చర్యలపై నిర్ణయం పాలకమండలిదే

3 May, 2019 10:53 IST|Sakshi

సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి చెందిన బంగారం తరలింపుపై ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పాలకమండలి నిర్ణయిస్తుందని టీటీడీ ఈఓ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన డయల్‌ యువర్‌ ఈఓ కార్యక్రమంలో భక్తుల సందేహాలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మే 13 నుంచి 15 వరకు తిరుమలలో పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వేసవిలో పెద్ద ఎత్తున తరలివచ్చే సామాన్య భక్తులకు  ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

వైకుంఠం క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని వెల్లడించారు. వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో వుంచుకోని వీఐపీ బ్రేక్ దర్శనాలు పూర్తిగా నియంత్రించామని తెలిపారు. కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు పిలిగ్రిమ్ వెల్ఫేర్ కమిటిని ఏర్పాటు చేసామని అన్నారు. ఏప్రిల్ మాసంలో 21.96 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 95 లక్షల లడ్డూలు విక్రయించామని వెల్లడించారు. హుండి ద్వారా 84.27 కోట్ల రూపాయలు ఆదాయం లభించిందన్నారు.

టీటీడీ ఆర్జిత సేవా టికెట్ల విడుదల
ఆగస్టు నెల ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. మొత్తం 67,737 టిక్కెట్లను విడుదల చేయగా వాటిలో జనరల్‌ క్యాటెగిరీ క్రింద  56,325 టిక్కెట్లు, ఆన్‌లైన్‌ ద్వారా 11,412 టిక్కెట్లు అందుబాటులో ఉంచనుంది. ఈ జనరల్‌ క్యాటెగిరీలో విశేషపూజ-1500, కళ్యాణం-13,300, ఉంజల్‌ సేవ-4200, ఆర్జిత బ్రహ్మోత్సవం-7425, వసంతోత్సవం-14,300, సహస్త్ర దీపాలంకారం15,600 టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. ఇక ఆన్‌లైన్‌ క్యాటెగిరీ క్రింద మొత్తం 11,412 టిక్కెట్లు విక్రయించనుండగా వాటిలో సుప్రభాతం-8117, తోమాల-120, అర్చన-120, అష్టాదలం-180, నిజపాదం-2875 టిక్కెట్లు అందుబాటులోఉంటాయి.

మరిన్ని వార్తలు