టీటీడీ సంచలన నిర్ణయం

14 Jul, 2018 12:03 IST|Sakshi

తొమ్మిది రోజుల పాటు వెంకన్న దర్శనం నిలిపివేత

సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి భక్తులకు షాక్‌ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 9వ తేదీ సాయంత్రం నుంచి 17 వరకు భక్తులకు స్వామివారి దర్శనాన్ని నిలిపేస్తున్నట్లు టీటీడీ ఛైర్మెన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ప్రకటించారు. శనివారం టీటీడీ ఆలయ అధికారులతో అత్యవసర సమావేశం జరిగింది. అనంతరం ఆలయ చైర్మన్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 11న అంకురార్పణ ఉంటుందని, 12వ తేదీ నుంచి 16 తేదీ వరకూ శ్రీవారి ఆలయంలో అష్ట బంధన బాలాలయ మహా సం‍ప్రోక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సంప్రోక్షణలో దాదాపు 30 వేల మంది భక్తులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. 

ఈ తొమ్మిది రోజుల పాటు కొండపైకి భక్తులను అనుమతించేది లేదని పుట్టా స్పష్టం చేశారు. టీటీడీ నిర్ణయంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ అధికారులపై మండిపడుతున్నారు. తొమ్మిది రోజుల పాటు భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం ఉండదు. గత కొంత కాలంగా టీటీడీలో చెలరేగుతున్న వరుస వివాదాల నేపథ్యంలో ఈ సమావేశం అందరిలో ఆసక్తి రేకిత్తిస్తోంది. శ్రీవారి నగలు మాయం చేస్తున్నారంటూ టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఘాటు విమర్శలు చేస్తున్న సమయంలో, తొమ్మిది రోజుల పాటు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తూ పాలక మండలి తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని వార్తలు