-

కల్కిభగవాన్ ఆశ్రమ భూములపై నివేదిక ఇవ్వండి

17 Apr, 2015 05:21 IST|Sakshi

చిత్తూరు కలెక్టర్‌కు శాసన సభ హామీల కమిటీ ఆదేశం
టీటీడీలో స్థానిక నెయ్యే వాడాలి
బర్డ్ ఆధునికీకరణకు నిధులు ఇవ్వండి
టీటీడీ ఈవోకు సూచన

 
యూనివర్సిటీ క్యాంపస్ : కల్కిభగవాన్ ఆశ్రమానికి సంబంధించిన భూములపై నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ హామీల అమలు కమిటీ చైర్మన్ టి.వెంకటేశ్వర్లు చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. తిరుపతిలో గురువారం శాసనసభ హామీల అమలు కమిటీ సమావేశమైంది. అనంతరం వివరాలను కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు మీడియాకు వివరించారు. టీటీడీలో అక్రమాలు, బీసీ విద్యార్థులకు ఉపకారవేతనాలు, టీటీడీ ఉద్యోగులకు ఇళ్లస్థలాలు, తుడాకు రూ.10 కోట్ల టీటీడీ నిధులు కేటాయించడం, మహద్వార ప్రవేశం అంశాలపై చర్చ జరిగిందన్నారు.

కల్కిభగవాన్ ఆశ్రమం ఆక్రమిత భూముల్లో ఏర్పాటైందని, దీనిపై ఆర్డీవో స్థాయి అధికారిని విచారణకు నియమించి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించామన్నారు. టీటీడీ అవకతవకలపై చర్చించామని తెలిపారు. 2005లో తుడాకు రూ.10 కోట్లు నిధులు కేటాయించడం, టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశాలపై చర్చించామని పేర్కొన్నారు. ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందున చర్చను వాయిదా వేశామన్నారు. కుమారధార, పసుపుధార ప్రాజెక్టుల అవకతవకలపై చర్చించామని తెలిపారు.

టీటీడీ కర్ణాటక, మహారాష్ర్ట్ర నుంచి ఆవు నెయ్యి కొనుగోలు చేసి వాడుతోందని ఇకపై మన రాష్ట్రానికి చెందిన నెయ్యే కొనాలని టీటీడీ ఈవోను ఆదేశించినట్టు కమిటీ చైర్మన్ వెంకటేశ్ తెలిపారు. అలాగే బర్డ్ ఆస్పత్రిని అభివృద్ధి చేయాలని, వెన్నెముక చికిత్సా కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని టీటీడీని ఆదేశించామన్నారు. టీటీడీ విద్యాసంస్థల్లో చదువుతున్న బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలపై చర్చించామని తెలిపారు. దీనిపై టీటీడీ పాలకమండళ్లు గతంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో సమస్యను పక్కన పెట్టామన్నారు. కమిటీ సభ్యులు గోవింద సత్యనారాయణ, చింతల రామచంద్రారెడ్డి, యోగేశ్వరరావు, రమేష్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఎం.సుగుణమ్మ, టీటీడీ ఈవో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు