షోడశ కళానిధికి షోఢశోపచారాలు..

23 Sep, 2017 11:33 IST|Sakshi

కొనేటిరాయని కైంకర్య వైభోగంసుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు..షట్కాల పూజలందుకుంటున్న దేవదేవుడు

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వర స్వామివారు నిత్యపూజా ప్రియుడు. దేవదేవునికి నిత్యం ఆరుసార్లు పూజలు జరుగుతాయి. ఆగమ భాషలో షట్కాల పూజ అంటారు. ప్రత్యూషతో మొదలై షట్కాలాలు వరుసగా  పూజలు జరుగుతాయి. ప్రత్యూష, ప్రాతఃకాల, మధ్యాహ్న, అపరాహ్న, సాయంకాల, రాత్రి పూజలు అందుకునే ఆ స్వామి నిత్య కైంకర్య వైభోగం అనిర్వచనీయం. –సాక్షి, తిరుమల

సుప్రభాత సేవ
‘కౌసల్యా సుప్రజా రామా... సంధ్యా ప్రవక్తతే’ అంటూ వేకు వ జామున సుప్రభాతంతో శ్రీవారిని  మేల్కొలుపుతారు.   ఇదే ప్రథమ పూజ సేవ. నిత్యం వేకువజాము సమయం మూడు గంటలకు ప్రారంభమవుతుంది. అంతకు ముందే ఆలయ అర్చకులు, జియ్యంగార్లు, ఏకాంగులు,  యాదవ వంశీకుడు (సన్నిధి గొల్ల) దేవాలయం వద్దకు చేరుకుంటారు. అప్పుడే నగారా మండపంలో గంట మోగుతుంది. మహాద్వారం గుండా సన్నిధి గొల్ల ముందు నడుస్తుండగా అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. కుంచె కోలను, తాళం చెవులను ధ్వజస్తంభం వద్ద నున్న   క్షేత్ర పాలక శిలకు తాకించి  ద్వారాలు తెరిచేందుకు   అనుమతి పొందుతారు.

తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీకుడు తం బురా పట్టుకుని మేలుకొలుపు పాట పాడేందుకు ముందుగా లోపలికి వెళతారు. వెంటనే పండితులు  సుప్రభాతాన్ని పఠిస్తారు. ఆ తర్వాత వేంకటేశ్వర స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం ఆలపిస్తారు. అదే సమయంలో తాళ్లపాక వంశీయుడు తంబురా మీటుతూ మూలమూర్తిని మేల్కొలుపుతాడు. అర్చక స్వాములు అంతర్‌ ద్వారం తలుపులు తెరిచి గర్భగుడిలోకి వెళ్లి శ్రీవారి పాద పద్మాలకు నమస్కరించి స్వామిని మేల్కొలుపుతారు.   

శుద్ధి
సుప్రభాత సేవ అనంతరం వేకువజామున మూడున్నర నుంచి మూడు గంటల నలౖభై ఐదు నిమిషాల వరకు ఆలయ శుద్ధి నిర్వహిస్తారు. గత రాత్రి జరిగిన అలంకరణలు, పూలమాలలన్నింటినీ తొలగిస్తారు. వాటన్నింటినీ సం పంగి ప్రదక్షిణంలో ఉండే పూలబావిలో వేస్తారు.  

అర్చన
శ్రీవారికి రోజూ తెల్లవారుజామున జరిగే ఆరాధన ఇది. జియ్యంగారు పూలగది నుంచి పుష్పమాలలు, తులసి మాలలతో ఉన్న వెదురుగంపను  తలపై పెట్టుకుని శ్రీవారి సన్నిధికి తెస్తారు. అర్చనకు ముందు పురుషసూక్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి ఆవుపాలు, చందనం, పసుపునీళ్లు, గంధపు నీటితో అర్చకులు అభిషేకం చేస్తారు. పుష్పాంజలి తర్వాత భోగమూర్తి విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు. ప్రోక్షణ చేసి మూల విగ్రహానికి, భోగమూర్తికి స్వర్ణ సూత్రాన్ని కలుపుతారు. ఈ సూత్రం ద్వారానే ధృవబేరం నుంచి భోగ   విగ్రహానికి శక్తి ప్రసరిస్తుందని నమ్మిక. శ్రీవారి సువర్ణ పాదాలను(తిరువడి) స్నాన పీఠంలో ఉంచి అభిషేకిస్తారు.

తోమాల సేవ
తమిళంలో ‘తోడుత్తమలై’ అంటే దారంతో కట్టిన పూలమాల అని అర్థం.  కాలక్రమంలో ‘తోమాల’గా మారి అదే తో మాల సేవగా మారి ఉండవచ్చని అర్చకుల  అభిప్రాయం. తోమాల సేవనే ‘భగవతీ ఆరాధన’ అని కూడా అంటారు. ఈ సేవలో భాగంగా వేంకటేశ్వర స్వామిని పూలమాలలతో అలం కరిస్తారు. వారంలో ఆరు రోజులు శుద్ధి్ద అనంతరం ఈ సేవ ఉంటుంది. శుక్రవారం మాత్రం అభిషేకం జరిపించిన తరువాత తోమాల సేవ చేస్తారు.

కొలువు
తోమాల సేవ తర్వాత పదిహేను నిమిషాల పాటు తిరుమామణి మండపంలో కొలువు శ్రీనివాసమూర్తికి దర్బార్‌ నిర్వహిస్తారు. బలి బేరానికి రాజోచిత మర్యాదలు నిర్వహించి ఆ నాటి గ్రహ సంచార క్రమాన్ని ఆరోజు జరిపించబోయే ఉత్సవ విశేషాల గురించి విన్నవిస్తారు. ముందు రోజు హుండీ ఆదాయం వివరాలను..ఏయే నోట్లు ఎన్ని వచ్చాయి.. నాణాలు మొత్తం విలు వను స్వామి వారికి తెలియజేస్తారు.

సహస్రనామార్చాన
నిత్యం ఉదయం నాలుగు నలభై ఐదు నిమిషాల నుంచి ఐదున్నర వరకు సహస్ర నామార్చన జరుగుతుంది. బ్రహ్మాండ పురాణంలోని స్వామి వారి వెయ్యి నామాలతో స్తుతిస్తూ చేసే అర్చన ఇది. ఈ అర్చన పూర్తయ్యాక శ్రీవారి పాదాల మీద ఉన్న పుష్పాలు, తులసి దళాలతో  దేవేరులకు పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో మిరాశీదారు వరాహ పురాణంలోని లక్ష్మీ సహస్ర నామాలను పఠిస్తారు.

మొదటి గంట, నైవేద్యం
మేలుకొలుపు, అభిషేకాలు, కొలువు కూటం, సహస్ర నామార్చన పూర్తయ్యాక స్వామి వారికి నైవేద్యం పెడతారు. నైవేద్య సమర్పణకు ముందుగా శయన మండపాన్ని శుభ్రం చేసి బంగారు వాకిలి తలుపులు మూసేస్తారు. తిరుమామణి మండపంలోని గంటలు మోగిస్తారు. అర్చకులు మాత్రం లోపల ఉండి స్వామి వారికి ప్రసాదాలను కులశేఖరపడి  (స్వామి వారికి ముందుమెట్టు) ఇవతల ఉంచి సమర్పిస్తారు.

అష్టోత్తర శతనామార్చన
ఈ అర్చనతోనే స్వామి వారికి మధ్యాహ్న పూజలు ప్రారంభమవుతాయి. వరాహ పురాణంలో వేంకటేశ్వరుడిని స్తుతిస్తూ ఉన్న నూట ఎనిమిది(108) నామాలను అర్చకులు పఠిస్తారు. అనంతరం శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చాన జరుపుతారు. అక్కడితో  మధ్యాహ్న పూజలు పూర్తవుతాయి. అనంతరం రెండో గంట నైవేద్యం ఉంటుంది.  

రాత్రి కైంకర్యాలు
ఉదయం జరిగే తోమాల సేవ వంటిదే రాత్రి పూట కూడా జరుగుతుంది. అనంతరం హారతి, స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన, శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన, నైవేద్య సమర్పణ జరుగుతాయి. ఈ సమయంలోనే మూడో గంట మోగుతుంది.  తర్వాత భక్తులకు సర్వదర్శనం ఉంటుంది.

ఏకాంత సేవ
నిత్యం రాత్రి ఒకటిన్నర గంటల తర్వాత స్వామికి పవళింపు సేవ నిర్వహిస్తారు. దీనినే ఏకాంత సేవ/ పవళింపుసేవ  అంటారు.  ఏడాదిలో 11 నెలలు,    భోగశ్రీనివాసుడికి, ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణుడికి నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు