శ్రీవారి ఆభరణాలు భద్రమే..!

26 Jun, 2018 02:43 IST|Sakshi

టీటీడీ చైర్మన్‌ సుధాకర్‌ యాదవ్‌

తిరుమల: అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తిరుమల శ్రీవారి ఆభరణాలున్నాయని, పోటులో ఎలాంటి తవ్వకాలు జరగలేదని టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ తెలిపారు. సోమవారం రాత్రి పద్మావతి అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవాస్తవాలు ప్రచారం చేయడం మానుకోవాలని రమణ దీక్షితులకు సూచించారు. శ్రీవారి ఆలయంలో వజ్ర వైఢూర్యాలతో కూడిన ఆభరణాలను బోర్డు సభ్యులతో కలసి నిశితంగా పరిశీలించినట్లు చెప్పారు.

1952 నుంచి మిరాశీ వ్యవస్థ రద్దయిన 1996 వరకు ప్రతి ఆభరణాన్ని తిరువాభరణం రిజిస్టర్‌లో నమోదు చేశారని తెలిపారు. 2001లో గరుడ సేవ సందర్భంగా భక్తులు నాణేలు విసరడంతో కెంపు రాయి పగిలిందని చెప్పారు. పగిలిన కెంపు పొడిని సేకరించి మూటకట్టి రిజిస్టర్‌లో నమోదు చేశారన్నారు. పోటులోని పురాతన గోడలు దెబ్బ తినకుండా అడుగు మందంతో ఫైర్‌ రిఫ్రట్టరీ బ్రిక్‌వాల్‌ మాత్రమే ఏర్పాటు చేశారని.. నేలపై ఎలాంటి తవ్వకాలు జరగలేదన్నారు. కాగా, శ్రీవారి ఆభరణాలు ప్రదర్శించాలన్న ప్రతిపాదన ఆగమ శాస్త్రానికి విరుద్ధమని ఆగమ సలహా మండలి సభ్యుడు సుందరవదన భట్టాచార్యులు చెప్పారు. 

మరిన్ని వార్తలు