నచ్చిన చోట శ్రీవారి ‘సేవ’

23 Apr, 2018 02:17 IST|Sakshi

25 నుంచి ఆన్‌లైన్‌లో నమోదుకు అవకాశం కల్పించిన టీటీడీ

సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో తమవంతు సేవలందించాలనుకునే వారికి టీటీడీ సువర్ణావకాశం కల్పించింది. ఇకపై శ్రీవారి సేవకులు ఎవరైనా తమకిష్టమైన విభాగాల్లో దేవుడి సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది. ఇందుకోసం ఈనెల 25 నుంచి ఆన్‌లైన్‌లో శ్రీవారి సేవకులు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని టీటీడీ ఆదివారం ప్రకటించింది. తిరుమల కొండపై దేవుడి సేవ చేయాలన్న తలంపుతో వచ్చే వారిని శ్రీవారి సేవకులు అంటారు.

ఏ రోజు ఎవరెవరు ఎక్కడెక్కడ స్వామివారి సేవ చేసుకోవాలో టీటీడీనే నిర్ణయిస్తుంది. అయితే ఎక్కువ మంది భక్తులు తమకు నచ్చిన చోట సేవలందించలేకపోయమాన్న బాధతో వెళ్లేవారు. ఈ నేపథ్యంలో టీటీడీ  శ్రీవారి సేవకులు తమకిష్టమొచ్చిన విభాగాల్లో సేవలు అందించే అవకాశాన్ని కల్పించనుంది. అన్నదానం, ఆరోగ్యశాఖ, నిఘా, భద్రత, కల్యాణకట్ట, వసతి విభాగాలతో పాటు హెల్ప్‌డెస్క్, తిరునామం సేవలను వీరికోసం అందుబాటులోకి తెచ్చింది. భక్తులు తమకు ఇష్టమైన సేవలను తామే ఎంచుకుని 3, 4, 7 రోజుల సేవలు చేసుకునేందుకు వీలు కల్పించనుంది. ఈ నూతన విధానాన్ని మే, జూన్‌ మాసాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.
 

మరిన్ని వార్తలు