నారాయణవనంలో అన్నదానానికి మంగళం

7 Jun, 2017 12:17 IST|Sakshi
నారాయణవనం : పద్మావతి సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అన్నప్రసాదాల వితరణ కార్యక్రమానికి టీటీడీ అధికారులు మంగళం పాడారు. కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న అన్నప్రసాదాల వితరణను ఈ ఏడాది ఆపివేయడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పది రోజులపాటు నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజూ మధ్యాహ్నం, రాత్రి ఆలయానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదాల వితరణ కార్యక్రమాన్ని ఆరేళ్ల క్రితం ప్రారంభించారు. తర్వాత అగస్తేశ్వర, వీరభద్ర స్వామి, శక్తి వినాయక ఆలయాల ఉత్సవాల్లోనూ వితరణ చేశారు. తిరుచానూరు నుంచి వాహనంలో సాంబారు, పెరుగన్నం తెచ్చి భక్తులకు అందించేవారు.
 
కల్యాణ వెంకన్న ఆలయ బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం కాగా మధ్యాహ్నం అన్నప్రసాదాల కోసం ఆలయానికి వచ్చే భక్తులతో పాటు స్వామి వారి సేవకు వచ్చే భక్తులు నిరాశతో ఆలయ సమీపంలోని సమాచార కేంద్రం వద్దకు వచ్చి వెనుదిరిగారు. వేసవి తీవ్రత దృష్ట్యా తిరుచానూరులోని టీటీడీ క్యాంటీన్‌ నుంచి తెచ్చే సాంబారు, పెరుగన్నం పాడైపోతోందని ఆలయ అధికారి నాగరాజు వివరణ ఇచ్చారు. ఆలయంలో స్వామి వారి దర్శనానంతరం భక్తులకు ప్రసాదాలను అందజేస్తున్నామని తెలిపారు.
మరిన్ని వార్తలు