శ్రీనివాసుని కల్యాణానికి తిరుమల శోభ

21 Mar, 2016 03:00 IST|Sakshi
శ్రీనివాసుని కల్యాణానికి తిరుమల శోభ

టీటీడీ తరహాలో ఉపమాకలో నిర్వహణ
అంతా ఆగమశాస్త్రానుసారమే..
వేదికపై అర్చకులకే అవకాశం
50 ఏళ్లుగా ఉత్సవాలకు..  ఈ ఏడాదికి పూర్తి వ్యత్యాసం

 
నక్కపల్లి: ప్రాచీన  పుణ్యక్షేత్రం ఉపమాకలో ఆదివారం వేకువజామున టీటీడీ నిర్వహించిన వేంకటేశ్వరస్వామి వార్షిక తిరుకల్యాణం ఆగమ శాస్త్రానుసారం జరిగింది. నిర్వాహణలో టీటీడీ తన సంప్రదాయాన్ని పాటించింది. అతిమర్యాదలకు పూర్తిగా స్వస్తి పలికింది. గత 50 ఏళ్లుగా నిర్వహిస్తున్న కల్యాణానికి ఇప్పటి కార్యక్రమానికి ఏమాత్రం సారూప్యం కనబడలేదు. ఇక స్వామి ఆలంకరణ తీరు కూడా పూర్తిగా మార్చివేశారు. తిరుపతి వెంకటేశ్వరస్వామికి తెచ్చే ప్రాంతం నుంచి ప్రత్యేకంగా పూలమాలలు ఇక్కడకు కూడా తెప్పించి అలంకరించారు. గతంలో స్వామి, అమ్మవార్లను పక్కపక్కనే ఉంచి ఏదో సాధారణంగా అలంకరించేవారు. ఈ ఏడాది మాత్రం స్వామికి కుడి,ఎడమ వైపున కాకుండా దూరంగా అభిముఖంగా శ్రీదేవీ, భూదేవిలను కూర్చోబెట్టి అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అత్యంత ఖరీదైన పట్టువస్త్రాలను తిరుపతి నుంచి తెప్పించారు. పంచమవేదాలు, ఆగమాన్ని చదివి వినిపించి భక్తులకు కళ్లకు కట్టినట్టుగా నిర్వహించిన తీరు మంత్రముగ్ధులను చేసింది. ఇంతకాలం ఈ ఆలయం దేవాదాయశాఖ ఆధీనంలో ట్రస్ట్ బోర్డు పర్యవేక్షణలో ఉండేది. అతిమర్యాదలు ఎక్కువగా ఉండేది. చోటామోటా రాజకీయనాయకుల ప్రమేయం ఎక్కువగా ఉండేది.

రాష్ట్రపతి, ప్రధాని, సీఎం, గవర్నర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పీఠాధిపతులు, జీయర్‌లకు మాదిరి పూర్ణకుంభం, ఆలయ మర్యాదలు, పరివట్టం వంటి స్వాగతాలు సామాన్యులకు దక్కేవి. కల్యాణోత్సవాల్లో వీరి హడావుడి అంతాఇంతా కాదు. కల్యాణ వేదికపైకూడా ఆశీనులయ్యేవారు. అర్చకులకంటే వీరే అధికంగా ఉండేవారు. ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నాక టీటీడీ అతిమర్యాదలకు స్వస్తిపలికింది. సామాన్యులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టింది. అలాగే కల్యాణాన్ని కూడా ఇదే తరహాలో నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై తిరుపతి నుంచి వచ్చిన ప్రధానార్చకులు, ఆగమ శాస్త్ర సలహాదారులు, అర్చక స్వాములు, వేదపండితులు, ఆలయ అర్చకులుతప్ప వేరెవరికి స్థానం కల్పించలేదు. టీటీడీ నుంచి వచ్చిన డిప్యూటీ జేఈవో, సూపరింటెండెంట్‌లు, ఇతర సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు సయితం వేదికకు ఎదురుగా కింద కూర్చొని కల్యాణ ఘట్టాన్ని తిలకించారు. భక్తులు స్వామి కల్యాణం తీరును చూసి ముచ్చటపడ్డారు. టీటీడీకి అభినందనలు తెలిపారు.
 

మరిన్ని వార్తలు