టీటీడీ అధికారి ఇంట్లో ముగిసిన ఏసీబీ దర్యాప్తు

10 Feb, 2016 02:32 IST|Sakshi

నిందితుడిని నెల్లూరు కోర్టుకు హాజరు
 
 తిరుపతిక్రైం : టీటీడీ డెప్యూటీ ఈవో భూపతి రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో దర్యాప్తు మంగళవారం ముగిసిందని ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపారు. భూపతిరెడ్డి ఆస్తులు విలువ ఎంతనేది అంచనాకు రాలేక పోతున్నామన్నారు. ఇప్పటికే ఆయన బంధుమిత్రులకు సంబంధించిన 9 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. అయితే 2015 డిసెంబర్‌లో  రూ.1.8 కోట్ల విలువ చేసే ఒక స్థలానికి రూ.65 లక్షలు చెల్లించి అగ్రిమెంట్ చేసుకున్నారని, అలాగే ఆయనకు తిరుచానూరు, రాఘవేంద్రనగర్ గ్రామీణ బ్యాంకుల్లో రెండు లాకర్లు ఉన్నాయని గుర్తించినట్లు చెప్పారు. ఆ లాకర్లను బుధవారం తెరుస్తామని, వాటిల్లో మరింత ఆస్తుల సమాచారం, ఇతరత్రా లభించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. అంతేకాకుండా ఇప్పటికే 12 ఖాతాలు ఉన్నట్లు గుర్తించామని, వాటిలో ఎంత మొత్తం నగదు వుందనేది బుధవారం నాటికి పూర్తిగా తెలుస్తుందన్నారు. అయితే ఐసీసీఐ బ్యాంకు ఖాతాలో మాత్రం రూ.37లక్షలు ఉన్నట్టు తేలిందన్నారు. ఇంకా పోస్టల్ డిపాజిట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో దర్యాప్తు చేస్తున్నామన్నారు. భూపతిరెడ్డిని నెల్లూరు కోర్టులో హాజరు పరచామన్నారు.

మరిన్ని వార్తలు