దీక్షితులుపై లీగల్‌గా ముందుకెళ్తాం: టీటీడీ ఛైర్మన్‌

5 Jun, 2018 20:02 IST|Sakshi
టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, తిరుమల: టీటీడీ ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఇటీవల ఉద్వాసనకు గురైన దేవస్థాన ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేవస్థాన వ్యవహరాలపై నిరాధార ఆరోపణలు చేస్తున్న దీక్షితులుపై లీగల్‌గా ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సుధాకర్‌ యాదవ్‌, ఈవో సింఘాల్‌ మంగళవారం మీడియాతో తిరుమలలో మాట్లాడారు. 24 ఏళ్లపాటు ప్రధాన అర్చకుడిగా ఉన్న దీక్షితులు దేవస్థాన వ్యవహారాలపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఛైర్మన్‌ మండిపడ్డారు. ఆరోపణలు చేసేముందు పాలక మండలి దృష్టికి తేవాల్సిందని అన్నారు.

శ్రీవారి ఆభరణాలను భక్తుల సందర్శనకు పెడతామనీ, దీనిపై ఆగమ శాస్త్ర పండితుల సలహాలను తీసుకుంటామని ఈవో సింఘాల్‌ తెలిపారు. ఆభరణాల పూర్తి భద్రత టీటీడీదేనని అన్నారు. టీటీడీ పాలక మండలి తీసుకున్న పలు నిర్ణయాలను వారు వెల్లడించారు. రాష్ర్ట వ్యాప్తంగా దళిత, గిరిజన వాడలు, మత్స్యకారుల నివాస ప్రాంతాల్లో ఒక్కోటి 10 లక్షల రూపాయల వ్యయంతో ఆలయాలు నిర్మిస్తామని తెలిపారు. జిల్లాలోని నాగలాపురంలో వేద పాఠశాల ఏర్పాటు చేయనున్నామని వివరించారు. తిరుమలలో 70 ఎకరాల విస్తీర్ణంలో సైన్స్‌ మ్యూజియం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు