భో'జనం'

9 Mar, 2020 11:22 IST|Sakshi
భోజనం క్యారేజీ అందుకున్న వృద్ధుడు ,అన్నంను బాక్సుల్లో నింపుతున్న కార్మికుడు

అభాగ్యుల పాలిట అన్నదాత తులసీరామ్‌

180 మంది పేద వృద్ధులకు రోజూ ఉచిత భోజనం  

ఇంటింటికీ క్యారేజీల్లో పంపిణీ

పశ్చిమగోదావరి ,భీమవరం: కన్నబిడ్డలే తల్లిదండ్రులను భారంగా భావిస్తున్న రోజులువి. అటువంటిది క్రమం తప్పకుండా ఏ ఆదరవు లేని వృద్ధులకు ప్రతి రోజు భోజనం పంపిస్తున్నారు. అదీ వృద్ధులున్నచోటకే క్యారేజీలు పంపించడం విశేషం. ఇలా పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు వీరవాసరం మండలం పంజా వేమవరం గ్రామానికి చెందిన మళ్ల తులసీరామ్‌(రాంబాబు). రైస్‌మిల్లర్‌గా, రొయ్యల రైతుగా తాను సంపాదించేదానిలో కొంతమొత్తాన్ని వృద్ధుల సేవకు వినియోగిస్తున్నారు. రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు యండగండి గ్రామంలో వృద్ధులకు భోజనం పెడుతున్న వైనాన్ని తెలుసుకుని తాను స్ఫూర్తి పొంది ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు రాంబాబు చెప్పారు. వీరవాసరం గ్రామంలోని తులసీ కన్వెన్షన్‌ హాలులో భోజనం తయారు చేయించి ప్రతి రోజూ పంజావేమవరం, వీరవాసరం గ్రామంలోని వృద్ధులకు పంపిస్తున్నారు. బుధ, ఆదివారాల్లో గుడ్డు, చేప, చికెన్‌ వంటి మాంసాహారం కూడా పెడుతుండటం విశేషం. అంతేకాదు ఒక్కోసారి రాంబాబు స్వయంగా ఆహారం వండుతారు. 2019 నవంబర్‌లో కేవలం 30 క్యారేజీలతో ప్రారంభమైన భోజనం పంపిణీ ప్రస్తుతం 180కి చేరుకుంది. 

జీవితకాలం కొనసాగించాలన్నదేలక్ష్యం 
కుటుంబసభ్యుల సహకారంతో వృద్ధులకు, అనాథలకు ప్రతి రోజూ ఉచితంగా భోజనం పంపిస్తున్నాను. అనేకమంది దాతలు సహకరిస్తామని ముందుకు వచ్చినా సున్నితంగా తిరస్కరించాను. అయితే కిరణా, కూరగాయల వ్యాపారులు తక్కువ ధరకే సరఫరా చేస్తున్నందుకు సంతోషం. నా సంపాదనతోనే జీవితకాలం ఈ పథకాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో ఉన్నాను. –మళ్ల తులసీరామ్‌(రాంబాబు),అన్నదాత, పంజా వేమవరం

తృప్తిగా భోజనం చేస్తున్నాను  
వృద్ధాప్యంలో వంట చేసుకోలేని దుస్థితిలో ఉన్న నాకు ప్రతి రోజు క్యారేజీ రావడంతో తృష్తిగా భోజనం చేయగలుగుతున్నాను. వంటలు కూడా రుచికరంగా ఉండటంతో ఎటువంటి ఇబ్బంది ఉండటం లేదు.  –వంకాయల మహాలక్ష్మి, వేమవరం  

రాంబాబు ఆశయం గొప్పది  
చిన్న వయస్సులోనే వృద్ధులకు భోజనం పంపించాలనే రాంబాబు ఆశయం పదిమందికి ఆదర్శం. రోజూ క్రమం తప్పకుండా వేడి వేడి పదార్థాలతో ఉదయం 10.30 గంటలకే భోజనం క్యారేజీ మా  ఇంటి ముందు సిద్ధంగా ఉంటుంది.  –పంజా రాఘవమ్మ 

మరిన్ని వార్తలు