యురేనియం చెత్త ‘శుద్ధి’పై రైతుల ఆగ్రహం

2 Jul, 2019 08:12 IST|Sakshi

వ్యర్థాలతో నిండుదశకు చేరిన టైలింగ్‌ పాండ్‌ 

వర్షాలు వస్తే పొంగి ప్రవహించే ప్రమాదం 

ప్రత్యామ్నాయవేటలో యూసీఐఎల్‌ 

యురేనియం వ్యర్థ జలాలు భూమిలోకి ఇంకిపోయి సాగు, తాగునీరు కలుషితమైంది. వ్యర్థ జలాలు భూగర్భజలాలతో కలిసిపోవడంతో వ్యవసాయం కుదేలైంది. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన అరటి పంట దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేముల మండలంలోని కె.కె.కొట్టాల, మబ్బుచింతలపల్లె, కనంపల్లె గ్రామాల్లో రైతులు ఆగ్రహించారు. టైలింగ్‌ పాండ్‌ పనులను అడ్డుకున్నారు. ఏడాదిన్నరగా పనులు నిలిచిపోవడంతో వ్యర్థ పదార్థాలను తరలించే టైలింగ్‌పాండ్‌ నిండుదశకు చేరింది. భారీ వర్షాలు వస్తే పొంగి ప్రవహించే ప్రమాదం ఉంది. దీంతో యూసీఐఎల్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలోని తుమ్మలపల్లె యురేనియం కర్మాగారంలో నాలుగు రోజులుగా యురేనియం ఉత్పత్తిని యూసీఐఎల్‌ నిలిపివేసింది. టైలింగ్‌ పాండ్‌ పనులు కొనసాగేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.పనులకు బాధిత రైతులు ససేమిరా అనడంతో యూసీఐఎల్‌ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. 

సాక్షి, వేముల(కడప) : తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టులో ముడి యురేనియం శుద్ధి చేయగా వచ్చే వ్యర్థ పదార్థాలను టైలింగ్‌ పాండ్‌కు తరలిస్తున్నారు. ఇందులోని వ్యర్థ జలాలు భూగర్భజలాల్లో ఇంకిపోయి వ్యవసాయ బోర్లు కలుషితమయ్యాయి.బోరు నీటిని అరటికి అందిస్తే పొలంపై తెల్లటి రసాయన పదార్థం మేట వేసి పంట ఎదుగుదల లేకుండా పోయింది. అరటి సాగు చేసిన ఆరు నెలలకు గెలలు వేయాలి. అయితే 10 నెలలైనా గెలలు వేయకపోవడంతో రైతులు నష్టపోయారు. 

టైలింగ్‌ వ్యర్థ జలాలు వ్యవసాయ బోర్లలో కలుషితం కావడంతో రైతులు ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కె.కె.కొట్టాల, కనంపల్లె గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఇక్కడి పరిస్థితులను యూసీఐఎల్‌ సీఎండీ హస్నాని దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎండీ గత ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన కె.కె.కొట్టాల, కనంపల్లె గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఇక్కడి పరిస్థితులను వివరించారు. వ్యర్థ జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అదే ఏడాది మార్చి 9న మళ్లీ వస్తానని చెప్పి ఇటువైపు తొంగి చూడలేదు. 

ఏడాదిన్నర్రగా నిలిచిపోయిన పనులు : 
టైలింగ్‌ వ్యర్థ జలాలు సాగునీటిలో కలిసిపోయి పంటలు దెబ్బతింటున్నా యూసీఐఎల్‌ పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన కె.కె.కొట్టాల రైతులు టైలింగ్‌ పాండ్‌ పనులను అడ్డుకున్నారు. టైలింగ్‌ పాండ్‌ను 5మీటర్ల మేర ఎత్తు పెంచే పనులను రూ.42కోట్లతో చేపట్టారు. అయితే సాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటామని యూసీఐఎల్‌ నుంచి స్పష్టమైన హామీ రాలేదు. దీంతో బాధిత రైతులు  పనులను అడ్డుకున్నారు. 

నిండుదశకు చేరిన వ్యర్థాల టైలింగ్‌ పాండ్‌.. : 
యురేనియం వ్యర్థాలను నింపే టైలింగ్‌ పాండ్‌ నిండు దశకు చేరింది. ఏడాదిన్నర్రగా యురేనియం కర్మాగారంలో ముడి పదార్థాన్ని శుద్ధి చేస్తున్నారు. అక్కడ నుంచి వ్యర్థాలను పైపులైన్‌ ద్వారా టైలింగ్‌ పాండ్‌కు తరలిస్తున్నారు. వర్షాలు కురిస్తే టైలింగ్‌ పాండ్‌ పొంగి ప్రవహించే ప్రమాదం ఉంది. పశువులు, జంతువులు తాగితే చనిపోయే ప్రమాదం నెలకొంది. ఇప్పటివరకు వర్షాలు రాకపోవడంతో యూసీఐఎల్‌ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాకాలంలో వానాలు కురిసి టైలింగ్‌ పాండ్‌లోని వ్యర్థ పదార్థం వాగు వెంబడి వెళితే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. యురేనియం వ్యర్థాలను నింపే టైలింగ్‌ పాండ్‌ పనులకు బాధిత రైతులు ససేమిరా అంటున్నారు. యూసీఐఎల్‌ అధికారులు వీరితో మాట్లాడి పనులు కొనసాగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో సమస్యను యూసీఐఎల్‌ అధికారులు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. 

ప్రాజెక్టులో నిలిచిపోయిన యురేనియం ఉత్పత్తి.. : 
యురేనియం వ్యర్థ పదార్థాలను తరలించే టైలింగ్‌ పాండ్‌ నిండు దశలో చేరడంలో యూసీఐఎల్‌ అధికారులు ప్రాజెక్టులో యురేనియం ఉత్పత్తిని నిలిపివేశారు. నాలుగు రోజులుగా పనులు జరగలేదు.  టెలింగ్‌ పాండ్‌ పనులు ప్రారంభమయ్యే వరకు కర్మాగారంలో ముడి పదార్థాన్ని శుద్ధిచేసే పరిస్థితి కనిపించలేదు.

శాశ్వత పరిష్కారం చూపాలి
టైలింగ్‌ వ్యర్థ జలాలు భూగర్భజలాల్లోకి ఇంకిపోయాయి. సాగు, తాగునీరు కూడా కలుషితమైంది. రేడియేషన్‌ ప్రభావం ఉంటోంది. దీంతో శరీరంపై దద్దులు వస్తున్నాయి.టైలింగ్‌పాండ్‌ వల్ల నెలకొన్న సమస్యలు పరిష్కారమయ్యే వరకు పనులు జరగనివ్వం. మాకు శాశ్వత పరిష్కారం చూపాల్సిందే. 
 – శ్రీనివాసులు(మాజీ సర్పంచ్‌), కె.కె.కొట్టాల 

ఆర్‌ఆర్‌ ప్యాకేజీ కింద ఇళ్లు, భూములు తీసుకోవాలి 
టైలింగ్‌ వ్యర్థాలతో   నష్టపోతున్నాం. పంటలను సాగు చేసుకునే పరిస్థితి లేదు. ఆర్‌ఆర్‌ ప్యాకేజీ కింద భూములు, ఇళ్లులు తీసుకోవాలి.  మా బాధలను యూసీఐఎల్‌ పట్టించుకోలేదు. 
 – చంద్రమోహన్‌(బాధిత రైతు), కె.కె.కొట్టాల

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా