సీమ రైతుల ఆశలు చిగురించేలా..

23 Feb, 2020 04:01 IST|Sakshi

తుంగభద్ర హెచ్చెల్సీ సమాంతర కాలువ ప్రతిపాదనను తెరపైకి తెచ్చిన ప్రభుత్వం 

ఏపీ సర్కార్‌ ప్రతిపాదనతో తొలిసారి ఏకీభవించిన తుంగభద్ర బోర్డు 

ఆమోదం లభిస్తే.. యుద్ధ ప్రాతిపదికన కాలువ తవ్వడానికి ఏర్పాట్లు 

కేటాయించిన మేరకు పూర్తి స్థాయిలో నీటిని వినియోగించుకునే అవకాశం 

దశాబ్దాల స్వప్నం సాకారమైతే.. రాయలసీమతోపాటు తుంగభద్ర ఆయకట్టుకూ మేలు

సాక్షి, అమరావతి: రాయలసీమ రైతుల నాలుగు దశాబ్దాల నాటి స్వప్నమైన తుంగభద్ర సమాంతర కాలువ నిర్మాణాన్ని సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తుంగభద్ర జలాశయం ఆయకట్టుకు సమర్థవంతంగా నీటిని సరఫరా చేయాలంటే ఎగువ ప్రధాన కాలువ (హెచ్చెల్సీకి) సమాంతరంగా వరద కాలువ తవ్వడం ఒక్కటే మార్గమని ఈనెల 15న తుంగభద్ర బోర్డుకు స్పష్టం చేసింది. చరిత్రలో తొలిసారిగా సమాంతర కాలువ నిర్మాణ ప్రతిపాదనపై బోర్డు సానుకూలంగా స్పందించింది. ఈ ప్రతిపాదనపై అధ్యయనం చేసి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. బోర్డు ఆమోద ముద్ర వేస్తే.. యుద్ధప్రాతిపదికన కాలువ తవ్వకం పనులు పూర్తి చేసి తుంగభద్ర వరద జలాలను ఒడిసి పట్టడం ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. 

నిండా నీళ్లున్నా దుర్భిక్షమే..
తుంగభద్ర జలాశయం వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం 132.473 టీఎంసీలు. కానీ.. పూడిక పేరుకుపోవడంతో నిల్వ సామర్థ్యం 100.855 టీఎంసీలకు తగ్గిపోయిందని బోర్డు చెబుతోంది. జలాశయం నుంచి 4 వేల క్యూసెక్కులు విడుదల చేసేలా హెచ్చెల్సీ (హై లెవెల్‌ కెనాల్‌), 1800 క్యూసెక్కులు విడుదల చేసేలా ఎల్లెల్సీ (లో లెవెల్‌ కెనాల్‌)ని తవ్వారు. 

- అనంతపురం జిల్లా వద్దకు వచ్చేసరికి హెచ్చెల్సీ సామర్థ్యం 1,500, ఎల్లెల్సీ సామర్థ్యం కర్నూలు జిల్లా సరిహద్దులో 725 క్యూసెక్కులకు పరిమితం అవుతోంది. దీనివల్ల వరద ప్రవాహం వచ్చినప్పుడు, ఆ మేరకు జలాలను తరలించలేని దుస్థితి నెలకొంది.  

గత 50 ఏళ్లలో తుంగభద్ర జలాశయంలోకి ఏటా సగటున 320 టీఎంసీల ప్రవాహం వస్తోంది. కానీ.. కాలువల సామర్థ్యం ఆ మేరకు లేకపోవడం వల్ల కేటాయించిన నీటిని వినియోగించుకోలేని దుస్థితి. జలాశయం చరిత్రలో ఇప్పటిదాకా ఏ ఒక్క ఏడాదీ బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన మేరకు 230 టీఎంసీలు వినియోగించుకున్న దాఖలా లేకపోవడమే ఇందుకు నిదర్శనం. 

హెచ్చెల్సీకి సమాంతరంగా రోజుకు ఒక టీఎంసీ (11,574 క్యూసెక్కులు) తరలించేలా వరద కాలువ తవ్వి, నదికి వరద వచ్చినప్పుడు జలాశయంలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకున్నాక.. సమాంతర కాలువ ద్వారా వరద నీటిని ఒడిసి పట్టి తరలించాలన్న డిమాండ్‌ నాలుగు దశాబ్దాలుగా ఉంది. వాటిని పీఏబీఆర్‌(పెన్న అహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌), మిడ్‌ పెన్నార్, చాగల్లు, పెండేకల్లు, మైలవరం, సీబీఆర్‌ (చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌)లలో నిల్వ చేయవచ్చు. తుంగభద్ర జలాశయంలోకి వచ్చే వరద పూర్తిగా తగ్గిపోయాక సమాంతర కాలువ ద్వారా తరలించిన నీటిని హెచ్చెల్సీ కోటాలో మినహాయించి.. మిగతా నీటిని జలాశయం నుంచి విడుదల చేయవచ్చు. దీనివల్ల తుంగభద్ర జలాశయంలో ఉన్న జలాలతో పూర్తి ఆయకట్టుకు సమర్థవంతంగా నీటిని అందించవచ్చు. సమాంతర కాలువ వల్ల అటు కర్ణాటక.. ఇటు రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు సమ న్యాయం చేకూరుతుంది. తద్వారా దుర్భిక్ష పరిస్థితులను అధిగమించవచ్చు. 

జలాల కేటాయింపు ఇలా.. 
తుంగభద్ర జలాశయంలో 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్‌ ట్రిబ్యునల్‌.. అందులో కర్ణాటక రాష్ట్రానికి 151.49, ఉమ్మడి ఏపీకి 78.51 టీఎంసీలు (ఆర్‌డీఎస్‌ వాటాగా తెలంగాణకు 6.51 టీఎంసీలు) కేటాయించింది. రాష్ట్రానికి కేటాయించిన 72 టీఎంసీల్లో హెచ్చెల్సీకి 32.5, ఎల్లెల్సీకి 29.5, కేసీ కెనాల్‌కు 10 టీఎంసీల వాటా ఉంది. హెచ్చెల్సీ కింద అనంతపురం, వైఎస్సార్‌ కడప, కర్నూలు జిల్లాల్లో 1,90,035, ఎల్లెల్సీ కింద కర్నూలు జిల్లాలో 1,57,062, కేసీ కెనాల్‌ కింద కర్నూలు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో 2.78 లక్షల ఎకరాలు వెరసి 6,25,097 ఎకరాల ఆయకట్టు విస్తరించింది. కర్ణాటక పరిధిలో వివిధ కాలువల కింద 9,26,914 ఎకరాల ఆయకట్టు ఉంది. హెచ్చెల్సీ కింద 1,99,920, ఎల్లెల్సీ కింద 92,670 ఎకరాల 
ఆయకట్టు ఉంది. 

ఎన్నాళ్లకెన్నాళ్లకు..
సమాంతర కాలువ తవ్వకానికి అనుమతి ఇవ్వాలని 2005లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి తుంగభద్ర బోర్డుకు, కర్ణాటక ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేశారు. అప్పట్లో కర్ణాటక వ్యతిరేకించడంతో తుంగభద్ర బోర్డు సమాంతర కాలువ ప్రతిపాదనను తోసిపుచ్చింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక సమాంతర కాలువ ప్రతిపాదనను తిరిగి తెరపైకి తెచ్చారు. గత ఏడాది ఆగస్టు 17న బెంగళూరులో జరిగిన తుంగభద్ర బోర్డు సమావేశంలో సమాంతర కాలువకు అనుమతి కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15న విజయవాడలో జరిగిన తుంగభద్ర బోర్డు సమావేశంలో అదే అంశాన్ని ప్రస్తావించింది. ఆయకట్టుకు సమర్థవంతంగా నీటిని అందించాలంటే సమాంతర కాలువ ఒక్కటే శరణ్యమని ప్రతిపాదించింది. దీంతో ఏకీభవించిన తుంగభద్ర బోర్డు ఛైర్మన్‌ రంగారెడ్డి దీనిపై అధ్యయనం చేయించి తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.  

మరిన్ని వార్తలు