కోడే గెలిచింది!

15 Jan, 2016 02:21 IST|Sakshi
కోడే గెలిచింది!

జిల్లా అంతటా కోడిపందేల బరులు, పేకాట శిబిరాల ఏర్పాటు
 పలుచోట్ల పందేలు {పారంభించిన ప్రజాప్రతినిధులు
చేతులు మారిన  కోట్లాది రూపాయలు

 
సంక్రాంతి సంప్రదాయం ముసుగులో పందెం కోళ్లు కత్తులు దూశాయి. కోడిపందేల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టి పందెంరాయుళ్లు తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. జిల్లాలో ఎక్కడికక్కడ ఏర్పాటుచేసిన బరుల్లో కోలాహలం నెలకొంది. కోట్లాది
 రూపాయలు చేతులు మారాయి. దాదాపు ప్రతిచోటా అధికార పార్టీకి చెందిన నాయకులు,   ప్రజాప్రతినిధులు ముందుండి కోడిపందేలను ప్రారంభించారు.
 
మచిలీపట్నం : జిల్లావ్యాప్తంగా కోడిపందేల బరులు, పేకాట శిబిరాలు కిటకిటలాడాయి. కైకలూరు నియోజకవర్గం కొల్లేటికోటలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు, పెడన మండలం కొంకేపూడిలో ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, పామర్రు మండలం కొమరవోలులో గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య కోడిపందేలను ప్రారంభించారు. జిల్లా నలుమూలలా పెద్ద ఎత్తున బరులను ఏర్పాటు చేశారు. బరుల వద్దే బెల్టు షాపులను పెట్టారు. పందెంరాయుళ్ల కోసం రెస్టారెంట్లను ఏర్పాటు చేసి సకల సౌకర్యాలు కల్పించారు. ఈ బరుల్లో పేకాట, చిన్నబజార్, పెద్దబజార్ పెద్దఎత్తున నిర్వహించారు. భోగి రోజున ప్రారంభమైన ఈ బరులు మూడు రోజులపాటు కొనసాగిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.
 
పెనమలూరు నియోజకవర్గం ఈడుపుగల్లులో స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మంగళవారం రాత్రే పోటీలను ప్రారంభించారు. వణుకూరులో ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ కోడిపందేలను ప్రారంభించారు.  గన్నవరం నియోజకవర్గం అంపాపురంలో పెద్దఎత్తున బరి ఏర్పాటుచేశారు. గురువారం ఉదయం ఏడు గంటలకు కోడిపందేలు, పేకాటను ప్రారంభించారు. బెల్టుషాపుతో పాటు రెస్టారెంట్లను ఇక్కడే నిర్వహించారు. పేకాట, కోడిపందేల కోసం మూడేసి శిబిరాలను నిర్వహించారు.
  
జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు, వత్సవాయిలో కోడిపందేలు జోరుగా కొనసాగాయి. పామర్రు నియోజకవర్గంలోని యలకుర్రు, కొమరవోలు, కనుమూరు ప్రాంతాల్లో కోడిపందేలు, పేకాటలు జరగగా లక్షలాది రూపాయలు చేతులు మారాయి. మైలవరం మండలంలో నాగులేరు, జి.కొం డూరు మండలంలోని వెలగలేరు, ఇబ్రహీంపట్నంలో భారీస్థాయిలో బరులను ఏర్పాటు చేశారు. నూజివీడు నియోజకవర్గంలో జనార్దనవరం, పోతిరెడ్డిపాలెం, జంగంగూడెం, ఈదర, శోభనాపురం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోడిపందేలు, పేకాట శిబిరాలు నిర్వహించారు. కైకలూరు నియోజకవర్గంలో కొల్లేటికోట, భుజబలపట్నం, భైరవపట్నం, కలిదిండి మండలం నాగన్నచెరువు తదితర ప్రాంతాల్లో భారీ స్థాయిలో కోడిపందేలు నిర్వహించారు.  పెడన, తిరువూరు నియోజకవర్గాల్లోనూ బరులు, పేకాట శిబిరాలు ఏర్పాటు చేశారు.
 

మరిన్ని వార్తలు