మహా జాప్యం

12 Sep, 2015 01:04 IST|Sakshi
మహా జాప్యం

నిరుపయోగంగా మారిన మహామండపం
రూ.32కోట్లు ఖర్చుచేసినా అక్కరకు రాని వైనం
ఈ ఏడాది దసరాకు తప్పని క్యూలైన్లు

 
దుర్గమ్మ దర్శనభాగ్యం కల్పించే మహాద్వారమన్నారు.. ఏడేళ్లు శ్రమించి ఏడంతస్తులు కట్టారు.. భారీ అంచనాలతో రూ.32కోట్లతో నిర్మించిన అతిపెద్ద భవంతిని మూణ్ణాళ్లకే తుస్సుమనిపించారు. భక్తుల సౌకర్యార్థం, దుర్గమ్మ త్వరిత దర్శనార్థం ఇంద్రకీలాద్రిపై నిర్మించిన మహామండపం నిరుపయోగంగా మారింది. దేవస్థానం ఆధ్వర్యంలో సరైన ప్రచారం కల్పించకపోవడం వల్ల భక్తులు ఘాట్‌రోడ్డులోని క్యూలైన్ల ద్వారానే దర్శనానికి వస్తున్నారు. దీంతో వచ్చే దసరాకూ మళ్లీ లక్షలు ఖర్చుచేసి క్యూలైన్లు నిర్మించాల్సిన దుస్థితి ఏర్పడింది.
 
ఇంద్రకీలాద్రి :  దసరా ఉత్సవాలకు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం మహామండపంలోని రెండు అంతస్తుల్లో క్యూలైన్లు.. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో కంపార్టుమెంట్లు, కల్యాణ మండపాలు.. ఇలా ఒకటేమిటి అన్నీ ప్రత్యేకతలేనని ఆలయ అధికారులు గొప్పగా చెప్పుకొన్నారు.  ఆచరణలో మాత్రం మహామండపం నిరుపయోగంగా మారింది. కనీసం శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజున వచ్చే భక్తులను సైతం మహామండపం క్యూలైన్‌లోకి మళ్లించలేదు. దీంతో ఎండలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండపాన్ని వినియోగంలోకి తీసుకురావడంలో దేవస్థాన ఇంజినీరింగ్ విభాగం విఫలమైందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. మండుటెండలో కాళ్ల కింద కనీసం పట్టాలయినా లేకుండా గంటల తరబడి క్యూలైన్‌లోనే భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితులు కల్పించారు. నెలన్నరలో రానున్న దసరా ఉత్సవాలకు సైతం మహామండపంలో పూర్తిస్థాయిలో పనులు కాకపోవచ్చునని అధికారులు అంచనాకు వచ్చినట్లు సమాచారం.

క్యూలైన్లు ప్రారంభమైనా ప్రయోజనమేదీ?
రెండేళ్ల కిందట ఈవోగా బాధ్యతలు నిర్వహించిన ప్రభాకర్ శ్రీనివాస్ తన హయాంలో జరిగిన దసరా ఉత్సవాల్లో అప్పటి సబ్ కలెక్టర్ హరిచందనతో మెట్లకు ప్రారంభోత్సవం చేయించారు. దర్శనం అనంతరం మెట్ల మార్గం గుండా భక్తులు అర్జున వీధికి చేరుకున్నారు. ఇక ప్రస్తుత ఈవో నర్సింగరావు ఈ ఏడాది ఏప్రిల్ 10న పీఠాధిపతులు, మంత్రుల స్వహస్తాలతో మండపాన్ని ప్రారంభించారు. సెప్టెంబర్‌లోనే ఈవో స్వయంగా క్యూలైన్లు ప్రారంభించి రూ.100 టికెట్ కొనుగోలు చేసిన వారు మెట్ల ద్వారా ఆలయ ప్రాంగణానికి చేరుకోవచ్చని ప్రకటించారు. వాస్తవానికి మండపంలో ఏర్పాటుచేసిన రెండు లిప్టుల ద్వారా భక్తులను ఆలయం వద్దకు చేర్చితే భక్తుల నుంచి స్పందన వచ్చేది. అయితే రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో దేవస్థానం అధికారులు లిఫ్టును మూసేయడంతో మహామండపం మీదుగా ఆలయానికి చేరుకునే వారి సంఖ్య పదిలోపు ఉంటుంది. ఈ టికెట్లను విక్రయించేందుకు సిబ్బందిని నియమించగా పక్షం రోజుల్లో కనీసం వారి వేతనానికి కూడా రాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, మహామండపాన్ని మాత్రం ఇంతవరకు దేవస్థానానికి స్వాధీనం చేయలేదని చెబుతున్నారు.

 శ్రావణ వ్రతాలూ నిర్వహించలేదు
 శ్రావణమాసంలో ఆది, శుక్రవారాలలో రద్దీని మహామండపం మీదుగా మళ్లించేందుకు అవకాశం ఉన్నా ఆలయ అధికారులు చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు దారి తీయడమే కాకుండా మండపం నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. కనీసం సామూహిక వరలక్ష్మి వ్రతాలను సైతం మండపంలో నిర్వహించలేదు.

 దసరా క్యూలైన్లు కెనాల్ రోడ్డులోనే..
 ఈ ఏడాది దసరా ఉత్సవాలకు మహా మండపంలోని క్యూలైన్ కాంప్లెక్స్‌ను సద్వినియోగం చేసుకుంటే దేవస్థానానికి లక్షలాది రూపాయలు మిగిలేవి. అయితే, పనులు ఇంకా పూర్తి కాలేదనే కారణంతో కూడా కెనాల్‌రోడ్డు మీదుగా క్యూ లైన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కోట్ల రూపాయల పనులు చేపట్టినా మండపాన్ని సద్వినియోగం చేసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని భక్తులు ఆరోపిస్తున్నారు.
 
 

>
మరిన్ని వార్తలు